ఆర్టీసీకి కాసుల వర్షం
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:29 PM
ఆర్టీసీకి బతుకమ్మ, దసరా పండుగతో పాటు పాఠశాలలకు సెలవుల కారణంగా సంస్థకు భారీగా ఆదాయం సమకూరింది. ఆర్టీసీ అధికారులు ప్రణాళికాబద్ధం గా బస్సులు నడిపించడంతో పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.
బతుకమ్మ, దసరా పండుగలకు భారీగా ఆదాయం
నల్లగొండ రీజియన్‌లో రూ.35.98కోట్లు
18రోజుల్లో 49లక్షల మందికిపైగా ప్రయాణం
అందులో 31లక్షల మంది మహిళలు
నల్లగొండ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీకి బతుకమ్మ, దసరా పండుగతో పాటు పాఠశాలలకు సెలవుల కారణంగా సంస్థకు భారీగా ఆదాయం సమకూరింది. ఆర్టీసీ అధికారులు ప్రణాళికాబద్ధం గా బస్సులు నడిపించడంతో పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. పండుగల సందర్భంగా ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి మొత్తం 960 దసరా స్పెషల్ బస్ సర్వీసులు నడిచాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి సెలవులకు అనుగుణంగా బస్సులు వెళ్లాయి. పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో ప్రజలు సొంతూళ్లకు వెళ్లిన నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులను కొనసాగించారు. నిత్యం 700 బస్సు సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తుండగా, పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని 18 రోజుల పాటు ప్రత్యేకం గా 960 బస్సు సర్వీసులు నడిపారు. పండుగల కు గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరుగు ప్రయాణంలో సైతం ప్రత్యేక సర్వీసులు కొనసాగాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సులోనే అధికంగా ప్రయాణించారు. రీజియన్ పరిధిలోని దేవరకొండ, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి, సూర్యాపేట, యాదగిరిగుట్ట డిపోల నుంచి ఈ స్పెషల్ సర్వీసులు నడిచాయి. ప్రతీ రోజు 80 బస్సుల చొప్పున ఆయా రూట్లలో అదనంగా నడపడంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యాలకు చేరారు. పండుగ రోజుల్లో ప్రతీ డిపో పరిధిలో 80 బస్సుల ద్వారా 160 ట్రిప్పుల వరకు నడిపారు.
18 రోజుల్లో రూ.35.98కోట్ల ఆదాయం
పండుగల సందర్భంగా 18 రోజుల పాటు స్పెషల్ సర్వీసులను నడిపిన ఆర్టీసీకి రూ.35,98,42,000 ఆదాయం సమకూరింది. అత్యధికంగా సూర్యాపేట డిపోకు రూ.9కోట్లకుపైగా ఆదాయం రాగా, నల్లగొండ డిపో రూ.7కోట్లకు పైగా ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. మొత్తంగా ఈ 18 రోజులు నడిపిన స్పెషల్ సర్వీసుల్లో 49,34,656 మంది ప్రయాణికులు ఆయా రూట్లల్లో ప్రయాణించారు. అందులో అత్యధికంగా మహిళలు మహాలక్ష్మి పథకం కింద 31,18,320మంది ప్రయాణించారు. మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని పెద్ద మొత్తంలో సద్వినియోగం చేసుకున్నారు. మహిళల టికెట్‌ను ప్రభుత్వం సంస్థకు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించనుంది. ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు 50.99లక్షల కి.మీలు నడిచి ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేరవేశాయి.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నడిపాం : టి.జోత్స్న, ఆర్టీసీ రీజినల్ మేనేజర్
పండుగల సందర్భంగా రీజియన్ పరిధిలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా పెద్ద సంఖ్యలో బస్సు సర్వీసులను నడిపించాం. ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులను ఏడు డిపోల ద్వారా నడిపాం. 50.99లక్షల కి.మీలు బస్సులు నడిచి 49,34 ,656 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలను చేరవేశాం. దీంతో సంస్థకు రూ.35.98కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. మహాలక్ష్మి పథకాన్ని 31,18,320మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్సులు నడిపాం. ఈ సందర్భంగా కండక్టర్లకు, గ్యారేజీ మెకానిక్‌లకు, ట్రాఫిక్ సూపర్వైజర్లకు, డిపో మేనేజర్లకు, పాలనా సిబ్బందికి ధన్యవాదాలు.
ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు ప్రయాణికుల సంఖ్య, ఆదాయం ఇలా..
డిపో ఆదాయం మొత్తం మహిళా
(రూ.లక్షల్లో) ప్రయాణికులు ప్రయాణికులు
దేవరకొండ 500.71 7,08,714 4,49,869
కోదాడ 420.67 5,26,270 2,91,681
మిర్యాలగూడ 491.12 7,10,136 4,17,786
నల్లగొండ 705.67 9,94,115 5,95,536
నార్కట్‌పల్లి 126.23 2,26,091 1,63,532
సూర్యాపేట 912.05 11,11,373 7,56,853
యాదగిరిగుట్ట 441.98 6,57,957 4,43,063
మొత్తం 3598.42 49,34,656 31,18,320