ప్రభుత్వ సాయంలో పావు వంతు ఇసుకకే
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:44 AM
ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ అందిస్తున్న సాయం ‘సంచి లాభం చిల్లుతో సరి’ అన్న నానుడికి సరిపోలా ఉంది. రూ.5లక్షల సాయంలో పావు వంతుకు పైగా ఇసుక కొనుగోలుకు వెచ్చించాల్సి వస్తోంది.
విభలాపురం లబ్ధిదారులను వేధిస్తున్న ఇసుక కొరత
పైలట్ పాజెక్టుగా ఎంపికైనా పూర్తికాని నిర్మాణాలు
గతేడాది 102 ఇళ్ల పనులు ప్రారంభం
ఏడాది గడిచినా 11 ఇళ్లు పూర్తి
ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.7 వేలు
ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ అందిస్తున్న సాయం ‘సంచి లాభం చిల్లుతో సరి’ అన్న నానుడికి సరిపోలా ఉంది. రూ.5లక్షల సాయంలో పావు వంతుకు పైగా ఇసుక కొనుగోలుకు వెచ్చించాల్సి వస్తోంది. ఒక్కో ఇంటికి 25 ట్రాక్టర్ల వరకు ఇసుక అవసరం కాగా స్థానికంగా ఉచితంగా లభించకపోవడంతో రూ.వేలు పోసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. మోతె మండలంలో ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.7 వేలు పలుకుతుండగా రూ.లక్షకు పైగా లబ్ధిదారులు ఇసుక కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గతేడాది 102 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 11 మాత్రమే పూర్తయ్యాయి.
(ఆంధ్రజ్యోతి-మోతె)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో పలు గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఆయా గ్రామానికి 100కు పైగా ఇళ్లను మంజూరు చేసింది. ఈ కోవలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మోతె మం డలం విభలాపురం గ్రామానికి మొదటి విడతలో ఎల్-1 కింద 156 ఇళ్లు మంజూరు చేశారు. గతేడాది జనవరి 102 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఏడాది గడిచినా 11 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వాటికి కూడా ఇంకా బిల్లులు రావాల్సి ఉంది. సగానికి పైగా నిర్మాణాలు మధ్యలో నిలిపివేశారు. 74 స్లాబ్ లెవల్, బేస్‌మెంట్ లెవల్, స్లాబ్ పైభాగం వరకు పనులు పూర్తయ్యాయి. కొన్ని గోడల వరకే పరిమితమయ్యాయి.
ఒక్కో ఇంటికి 25 ట్రాక్టర్ల ఇసుక
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ లెక్కల ప్రకా రం సుమారు 13 ట్రాక్టర్లకు పైగా ఇసుక అవసరం ఉం టుంది. వాస్తవంగా 25 ట్రాక్టర్ల అవసరం అవుతుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించకపోయినా, స్థానికంగా ఇసుక లభ్యమయ్యే వాగులు, ఇసుక రీచల నుంచి తరలించుకుపోయేందుకు అవకాశం ఇచ్చింది. ఇందుకోసం అధికారు లు లబ్ధిదారులకు టోకెన్లను అందజేస్తారు. అయితే విభలాపురం సమీపంలోని పాలేరు, కూడలి వాగులు నీటితో నిండి ఉండటంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ట్రాక్టర్ కు రూ.7 వేలకు పైగా ధర పలుకుతుండటంతో రాజమండ్రి నుంచి లారీల్లో కొనుగోలు చేసి డబ్బులున్న మేర కు ఒక్కొక్కరుగా ఇసుకను వాడుకుంటున్నారు. దీంతో ఇసుక అవసరాల కోసమే ప్రభుత్వం సాయంలో రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఇసుక కొరతతో నిలిచిన నిర్మాణాలు
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయం నిర్మాణాని కి సరిపోకపోవడంతో వేగంగా పనులు చేయలేకపోతున్నారు. ప్రధానంగా ఇసుక కొరతతో లబ్ధిదారు లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి కూతవే టు దూరంలో పాలేరు, కూడలి ఇసుక వాగులు ఉన్నా ఇసుక మాత్రం అందని ద్రాక్షలా మారింది. గతేడాది రెండు వాగుల్లో నీటి ఉధృతి పెరిగింది. ఉన్నచోట్ల ఈ వాగుల నుంచి ఇసుకను అక్రమార్కులు లబ్ధిదారులకు అందకుండా తరలించి పెద్దసంఖ్యలో డంపులు చేశారు. దీంతో ట్రాక్టర్ ఇసుకను రూ.7 వేలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అసలే అంతంతమాత్రం ఆర్థికస్థోమత కలిగిన పేదలు అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయలేక పనులను అర్థాంతరంగా నిలిపివేశారు.
పెద్దసంఖ్యలో ఇసుక డంపులు
పాలేరు, కూడలి వాగుల నుం చి తరలించిన ఇసుకను వ్యాపారు లు వివిధ ప్రాంతాల్లో పెద్దసంఖ్య లో డంపు చేశారు. ఓ వైపు ఇసుక కొరతతో ఇళ్ల నిర్మాణం...నిలిచిపోతుండగా, మరోవైపు అక్రమంగా ఇసుక తరలించి డంప్‌లు పోసిన విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ, పోలీసు అధికారు లు కలిసి దాడులు చేసి సీజ్ చేశారు. సుమారు 250 ట్రాక్టర్లకు పైబడి ఇసుక ఉన్నట్లు సమాచారం. పత్రికల్లో వచ్చిన కథనాలు, స్థానికుల ఫిర్యాదుతో కదలిన అధికార యంత్రాంగానికి పెద్దమొత్తంలో ఇసుక డంప్‌లు లభ్యమయ్యాయి.
పట్టుబడ్డ ఇసుక పంపిణీ
ఇటీవల నాలుగు లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ ఇసుకను రెవెన్యూ అధికారులు లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. అయితే అధికారులు కొందరు దళారులు సూచించిన వారికే ఇసుక పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సీజ్ చేసిన పెద్దమొత్తంలోని డంప్‌లకు సంబంధించిన ఇసుకను మధ్యవర్తులకు సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ పంపిణీచేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఇసుకకొరతతో ఇబ్బందులు పడుతున్నాం
ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల ఇంటి నిర్మాణం చేపట్టలేకపోతున్నాం. ట్రాక్టర్ ఇసుక రూ.7వేలకు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తే భారం తగ్గుతోంది. మండలంలో అక్రమంగా నిల్వలు చేసిన ఇసుకను అధికారులు అవసరమైన వారిని గుర్తించి అందించాలి.
- గంధం నీలమ్మ, ఇందిరమ్మ లబ్ధిదారురాలు
ఉచితంగా ఇసుకను అందజేస్తాం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు ఇచ్చే టోకెన్ల ఆధారంగా స్థానికంగా వాగులు, రీచల నుంచి ఉచితంగా తరలించుకోవచ్చు. అంతేకాకుండా అధికారులకు పట్టుబడ్డ ఇసుకను కూడా లబ్ధిదారులు పొందవచ్చు. కాకపోతే నిర్మాణం చేపడుతున్న ప్రతి ఒక్కరికీ విడతల వారీగా చెల్లింపు ఉంటాయి.
నాగరత్తమ్మ, హౌసింగ్ ఏఈ
సీజ్ చేసిన ఇసుకను లబ్ధిదారులకు అందజేస్తాం
విభలాపురంలో నిర్మాణాలు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను పంపిణీ చేస్తాం. లబ్ధిదారుల వివరాల ప్రకారం అందజేస్తున్నాం. ఇటీవల పట్టుబడిన నాలుగు లారీల ఇసుకను పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేశాం. కూడలి వద్ద అక్రమంగా డంపుల నిల్వలు చేసిన వాటిని సైతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు త్వరలో అందజేస్తాం.
వెంకన్న, తహసీల్దార్, మోతె