నియోజకవర్గానికో కొత్త బడి
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:06 PM
అక్షరాస్యతలో ముందు వరుసలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి సూచనల కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణం
కార్పొరేట్ వసతులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు
జిల్లాలోని 17 మండలాల్లో.. 15 పాఠశాలల అప్‌గ్రేడ్‌కు పరిశీలన
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): అక్షరాస్యతలో ముందు వరుసలో నిలిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి సూచనల కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాకమిషన్ సూచనల మేరకు ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లి క్ స్కూల్ (యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్) ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా ప్రమాణాల బోధన అందించే విధంగా 2026-27 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభించాలని సంకల్పించింది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా కార్పొరేట్ వసతులు, ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేయడంతో సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకనామి (క్యూర్) పరిధిలో 100 నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరానికి(అవుటర్ రింగ్ రోడ్డు) వెలుపలగల నియోజకవర్గాల్లో ఈ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఈమేరకు ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలోగల వనరులను ఉపయోగించుకోనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్న, ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే అదనపు భవనా లు,కార్పొరేట్ అత్యాధునిక విద్యావసతులు, డిజిటల్ క్లాస్ రూమ్‌లతోపాటు ఆధునిక క్రీడాసౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అ నుకూలంగా ఉన్న వాటిని జిల్లా విద్యాశాఖాధికారులు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నారు.
జిల్లాలో 17 మండలాల్లో 15 పాఠశాలల పరిశీలన
ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్) ఏర్పాటుకు జిల్లాలో ని జిల్లా పరిషత్ పాఠశాలలను జిల్లా అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అవసరమైన స్థలం అందుబాటులోగల పాఠశాలలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. తెలంగాణ పబ్లిక్ స్కూ ల్ ఏర్పాటుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం గల పాఠశాలలకు కనీసం అయిదు ఎకరాల కంటే ఎక్కువగా స్థలం కలిగి ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల సంఖ్య సైతం గణనీయంగా ఉండాలి. జిల్లాలో ని 17 మండలాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తు న్న విద్యార్థు ల సంఖ్యకూడా అధికంగా ఉండి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనుకూలమైనవిగా 15 పాఠశాలల ప్రాంగణాలను గుర్తించారు. వీటిని కలెక్టర్ ద్వారా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు ప్రతిపాదించనున్నారు. ఉన్నతస్థాయిలో అధికారుల మార్గదర్శకాల ప్రకారం గల ప్రాంగణాలు గల పా ఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా ఏర్పాటు చేసేందుకు మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రత్యేకతలు
ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గం లో పేద, మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యావసతులు అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యా బోధనకు అవసరమైన వసతులు, సౌకర్యాల కల్పనకు ఒక్కో పాఠశాల కు దాదాపు రూ.200కోట్లు కేటాయించనుంది. ఈ పాఠశాల నిర్వహణకు సైతం యేటారూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనాలను రూపొందించారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, బీసీ వర్గాలతో పాటు ఇతర వర్గాల విద్యార్థులు ఒకే చోట కలిసి చదవుకుకోవడానికి, ఆడుకోవడానికి సమగ్ర విద్యావిధానం రూపొందించారు. ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, అత్యాధునిక క్రీడా సౌకర్యాలు, ఏఐ అవగాహన కల్పించే కార్పొరేట్‌స్థాయి ప్రమాణాలతో నిర్వహించనున్నారు. డేస్కాలర్ విధానంలో నిర్వహించే పాఠశాల విద్యార్థులకు పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థుల రాకపోకలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం సైతం కల్పించనున్నారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలోని భారతీయ విద్యాభవన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహాలో పూర్తి కార్పొరేట్‌స్థాయి విద్యా బోధన అందించాలనేది ప్రభుత్వ సంకల్పం.
జిల్లాకు రెండు నుంచి నాలుగు మంజూరీకి అవకాశం
రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్) ఏర్పాటుకు ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా జిల్లా పరిధిలో రెండు నుంచి నాలుగు పాఠశాలల ఏర్పాటుకు అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరానికి సమీపంలో, ఔటర్‌కు బయటగల యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 17 మండలాలున్నాయి. వీటిలో ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది, భువనగిరి నియోజకవర్గంలో ఏడు మండలాలతో పూర్తిగా ఉండగా, మరో మూడు నియోజకవర్గాల్లో జిల్లాకు చెందిన మరో ఐదు మండలాలు మిలితమవుతున్నాయి. వీటిలో మునుగోడు నియోజకవర్గంలో సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్, తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూరు, అడ్డగూడూరు, నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలాలున్నాయి. అయితే నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదనల్లో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో రెండు పాఠశాలలు తప్పనిసరిగా జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అయితే మిగతా వాటిలో తుంగతుర్తి, మునుగోడుతోపాటు నకిరేకల్ నియోజకవర్గాలకు చెందిన పాఠశాలల ఏర్పాటుకు జిల్లాలోని జడ్పీ హైస్కూల్స్ అనుకూలంగా ఉన్న పాఠశాలలు ఉన్నందున మరో రెండు కూడా జిల్లాలో ఏర్పాటు జరిగే అవకాశాలున్నాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.