Share News

4.47శాతం గృహాల్లో కనుమరుగు

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:27 AM

దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఓ ఉద్యమంగా చేపట్టారు. దాదాపు పుష్కర కాలంగా ఈ మిషన్‌ కింద బహిరంగ మలవిసర్జన రహిత ఆవాసాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలను ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ) జిల్లాలుగా అధికార యంత్రాంగం రేటింగ్‌లను ప్రకటించుకుంది. అయినా ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది.

4.47శాతం గృహాల్లో కనుమరుగు

ఓడీఎఫ్‌గా ప్రకటించినా.. మరుగుదొడ్లు లేని గృహాలెన్నో

సమగ్ర ఇంటింటి సర్వేలో గృహాల స్థితిగతుల వెల్లడి

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి) : దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఓ ఉద్యమంగా చేపట్టారు. దాదాపు పుష్కర కాలంగా ఈ మిషన్‌ కింద బహిరంగ మలవిసర్జన రహిత ఆవాసాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలను ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ) జిల్లాలుగా అధికార యంత్రాంగం రేటింగ్‌లను ప్రకటించుకుంది. అయినా ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది.

వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2024లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే చేపట్టింది. ఈ సర్వే నివేదికలో గృహాల్లో సామాజికవర్గాలవారీగా అందుబాటులోని సౌకర్యాలను సేకరించి నివేదికను బహిర్గతం చేసింది. దీని ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంకా మరుగుదొడ్లు లేని గృహాలు 14.47శాతం ఉన్నట్లు ప్రకటించారు. వీటిలో అత్యధికంగా మరుగుదొడ్లు లేనిజిల్లాగా సూర్యాపేటలో 18.70శాతం, నల్లగొండలో 15శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7.40శాతం ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

1.65లక్షల గృహాలకు మరుగుదొడ్లు లేవు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,43,936 గృహాలుండగా, వీటిలో 1,65,517 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం అందుబాటులోలేదు. జిల్లాలవారీగా పరిశీలిస్తే సూర్యాపేట జిల్లాలో మొత్తం 3,71,352 గృహాలకు 69,746 గృహాలకు, నల్లగొండ జిల్లాలో 5,11,638 గృహాలకు 76,746 గృహాలకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,60,766 గృహాలకు, 19,297 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయాలే లేవు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మరుగుదొడ్ల సదుపాయం లేని గృహాల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 13.3శాతంగా ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా 14.47శాతంతో 1.17శాతం కుటుంబాలుఎక్కువగా మరుగుదొడ్లు లేకుండా జీవిస్తున్నాయి. జిల్లాల వారిగా రాష్ట్ర సగటు కంటే నల్లగొండలో 1.70శాతం ఎక్కువ కుటుంబాలు ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం రాష్ట్ర సగటు కంటే 6.10శాతం తక్కువ కుటుంబాలే మరుగుదొడ్లు లేకుండా దుర్భర జీవితాలు గడుపుతున్నారు. దాదాపు దశాబ్దపు కాలంగా స్వఛ్చాబారత్‌ మిషన్‌ పేరిట వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్తితుల ప్రకారం మరుగుదొడ్లు లేని కుటుంబాల సంఖ్య ఇంకా గణనీయంగా ఉండటం ఆర్ధిక, సామాజిక అసమానతలకు అద్దం పట్టే ఆందోళనకర అంశమే..

సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు అద్దం

సమాజ అభివృద్ధి సూచికలో భాగంగా పరిగణించే వ్యక్తిగత మరుగుదొడ్ల అంశంలో రాష్ట్రంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వెనుకబాటునే సామాజిక, ఆర్థిక, కుల గణన నివేదిక సూచిస్తోంది. మహిళలు, బాలికల ఆత్మగౌరవం, ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సామాజికవర్గాల్లో షెడ్యూల్‌ కులాల కుటుంబాలే ఎక్కువగా వ్యక్తిగత మరుగుదొడ్లు లేకుండా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సామాజికవర్గాలవారీగా వ్యక్తిగత మరుగుదొడ్లులేని కుటుంబాల్లో ఎస్టీ వర్గాల్లో 31.30శాతం ఉండగా, నల్లగొండ జిల్లాలో 30.20శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 15.06 శాతం ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో పరిశీలిస్తే ఎస్టీ వర్గాల్లోనే వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలే ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ వర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో 27శాతం, నల్లగొండ జిల్లాలో 20.30శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11.6శాతం ఉన్నారు. ఇక బీసీ వర్గాల్లో సూర్యాపేట జిల్లాలో 15.40 శాతం, నల్లగొండ జిల్లాలో 11.50 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6.20 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లులేని గృహాలున్నాయి. ఓసీ, ఇతర వర్గాలకు చెందిన వ్యక్తిగత మరుగుదొడ్లులేని గృహాల్లో సూర్యాపేట జిల్లాలో 7.20శాతం, నల్లగొండ జిల్లాలో 6.20శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో కేవలం 4.10శాతం మాత్రమే ఉన్నాయి. ఆర్థిక అసమానతల ప్రకారమే వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వర్గాల్లో ఎస్టీ వర్గాలకు చెందిన గృహాలు ఎక్కువగా ఉండగా, వరుసగా ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలు (శాతంలో)

జిల్లా గృహాలు ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ

యాదాద్రి 19,297 15.06 11.60 6.20 4.10

నల్లగొండ 76,746 30.20 20.30 11.50 6.20

సూర్యాపేట 69,746 31.30 27.00 15.40 7.20

జిల్లా మొత్తం గృహాలు మరుగుదొడ్లు లేనివి

సూర్యాపేట 3,71,352 69,746

నల్లగొండ 5,11,638 76,746

యాదాద్రి 2,60,766 19,297

మొత్తం 11,43,936 1,65,517

Updated Date - Apr 27 , 2026 | 12:27 AM