Share News

పేరుకే 24గంటల వైద్యం

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:08 AM

రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందిచాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది.

పేరుకే 24గంటల వైద్యం
తుర్కపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

తుర్కపల్లి పీహెచసీలో సిబ్బంది కొరత

రోగులకు అందని వైద్యం

పట్టించుకోని అధికారులు

తుర్కపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందిచాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. అంతే కాకుండా మారుమూల గిరిజన ప్రాంతమైన తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం ఎంతో మంది పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి వస్తారు. ఆసుపత్రిలో సరిపడా సిబ్బంది లేక పోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో స్వీపర్‌, అటెండర్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో పరిపరాలు చెత్తచెదారం, పిచ్చి మొక్కలతో పారిశుధ్య సమస్య నెలకొంది. సంవత్సర కాలంగా మెడికల్‌ ఆఫీసర్‌-2 ఖాళీగా ఉంది. సంవత్సర కాలంగా నైట్‌ వాచమన లేడు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేయాల్సిన ల్యాబ్‌ టెక్నీషియన అనారోగ్య సమస్యలతో సెలవుపై విళ్లినట్లు తెలిసింది. ఆసుపత్రిలో నలుగురు స్టాప్‌ నర్సులు ఉండాల్సి ఉండగా ఒకరు బదిలీకాగా మరొకరు సెలవుపై వెళ్లడంతో ఇద్దరే పని చేస్తున్నారు. డాక్టర్‌ రుచిరారెడ్డి ఉన్న సిబ్బందితోనే ఆసుపత్రికి వస్తున్న రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందిచాల్సి ఉన్నా సిబ్బంది కొరత కారణంగా వైద్యం అందక పోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి పీహెచసీలో ఖాళీగా ఉన్న పోస్టులను సిబ్బందితో భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

భయంతో విధుల నిర్వహణ

తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24గంటల వైద్య సేవలందించాల్సి ఉండడంతో రాత్రి పూట డ్యూటీ చేయాలంటే సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రిలో నైట్‌ వాచమన, ఆయా లేక పోవడంతో రాత్రి వేళలో డ్యూటీ నిర్వహించే స్టాఫ్‌ నర్సు ఒక్కరే ఆసుపత్రిలో ఉండాల్సి వస్తోంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక్కరమే ఉండడంతో భయానికి గురవుతున్నామని మంటున్నారు. రాత్రి వేళలో వచ్చే రోగులు ఎవరు ఎలా ఉంటారో తెలియక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.

పల్లె దవాఖాన డాక్టర్లతో పీహెచసీలో సేవలు

మండల కేంద్రంలోని పీహెచసీలో డాక్టర్‌ ఒక్కరే ఉండడంతో ఫీల్డ్‌ వర్క్‌, సెలవుపై వెళ్లినా, జిల్లా కేంద్రంలో మీటింగ్‌కు వెళ్లినప్పుడు పల్లె దవాఖానలో పని చేస్తున్న వైద్యుల్లో ఎవరో ఒకరని పీహెచసీకి డిప్యూటేషన వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. పల్లె దవాఖాన డాక్టర్లు పీహెచసీకి వచ్చినప్పుడు పల్లె దవాఖానలో డాక్టర్‌ లేకపోవడంతో ఆ పల్లె దవాఖాన పరిధిలోని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీ పోస్టులు ఇలా..

మెడకల్‌ ఆఫీసర్‌ 2 -ఖాళీ

ఫార్మాసిస్టు - ఖాళీ

స్టా్‌ఫ్‌ నర్సు - 2

యూడీసీ - ఖాళీ

అటెండర్‌ - ఖాళీ

నైట్‌ వాచమన - ఖాళీ

ఆయా - ఖాళీ

ల్యాబ్‌ టెక్నీషియన- సెలవులో ఉన్నారు.

ఐదు సబ్‌ సెంటర్లలో ఏఎనఎం ఒక్కొక్కరే..

తుర్కపల్లి పీహెచసీ పరిధిలో తుర్కపల్లి, మాధాపూర్‌, వేలుపల్లి, పల్లెపహాడ్‌, వీరారెడ్డిపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా ఈ ఉప కేంద్రాల్లో ఇద్దరు చొప్పున ఏఎనఎంలు పని చేయాల్సి ఉండగా ఒక్కొక్కరే పని చేస్తున్నారు. గ్రామా ల్లో సీజనల్‌ వ్యాధులు వచ్చే ప్రమాదముంది కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి ఖాళీ పోస్టుల్లో సిబ్బందిని నియమించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను

-డాక్టర్‌ రుచిరారెడ్డి

తుర్కపల్లి పీహెచసీలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న సిబ్బందితోనే వైద్య సేవలు అందిస్తున్నాం. ఆసుపత్రిలో ఖాళీ పోస్టులకు సంబంధించి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాను.

Updated Date - Mar 05 , 2026 | 12:08 AM