కొత్త పింఛన్లు 14,101
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:55 PM
సామాజిక భద్రతా పథకంలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఊరట లభించనుంది. దీపావళి కానుకగా చేయూత పింఛన్ల మంజూరును ప్రభుత్వం ప్రారంభించింది.
నేటి నుంచి 18 వరకు ప్రొసీడింగ్స్ పంపిణీ
ఈ నెల 19 నుంచి ఖాతాల్లో నగదు జమ
అత్యధికంగా వలిగొండలో 1,090, భువనగిరిలో 1,049
7,215 మంది వితంతువులకు కొత్తగా లబ్ధి
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): సామాజిక భద్రతా పథకంలో కొత్తగా చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఊరట లభించనుంది. దీపావళి కానుకగా చేయూత పింఛన్ల మంజూరును ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో కొత్తగా పెన్షన్లు మంజూరైన 14,101 మంది లబ్ధిదారులకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.
కొత్త పెన్షన్లకు సం బంధించిన ప్రొసీడింగ్స్ పంపిణికి మండలాలు, మునిసిపాలిటీల వారీగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎంపీడీవో లు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్ల కు వీటి పంపిణీ బాధ్యతలను అప్పగించారు. ఈ పత్రాలను నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు అందజేయనున్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు ఈనెల 19న జమచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వలిగొండలో అత్యధికంగా మంజూరీ
కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు వలిగొండ మండలంలో అత్యధికంగా ఉన్నారు. ఈ మండలంలో 1,090 మంది కి కొత్తగా చేయూత పింఛన్లు అందనున్నాయి. అదే విధంగా భువనగిరి మండలంలో 1,049, రామన్నపేటలో 958, నారాయణపురంలో 906, చౌటుప్పల్‌లో 865 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. యా దగిరిగుట్టలో 759మంది, రాజాపేటలో 747, పోచంపల్లిలో 637, గుండాలలో 609, ఆత్మకూర్(ఎం)లో 531, ఆలేరులో 502, అడ్డగూడూరులో 476, బీబీనగర్‌లో 644, బొమ్మలరామారంలో 442, తుర్కపల్లిలో 485, మోటకొండూరులో 416, మోత్కూరులో 263 మందికి కొత్త పింఛన్లు అందనున్నాయి. పట్టణ ప్రాంతాలైన భువనగిరి ము నిసిపాలిటీలో 831 మందికి, చౌటుప్పల్‌లో 530, పోచంపల్లిలో 431, యాదగిరిగుట్టలో 327, ఆలేరులో 300, మోత్కూరు మునిసిపాలిటీ లో 303 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి.
17,480 దరఖాస్తులు
జిల్లాలో చేయూత పథకంలో కొత్తగా పింఛన్ల మంజూరుకు 17,480 మంది దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను మూడు అంచెల్లో వడపోసి, 14,101మందికి చెందిన దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. వీరిలో 7,215 మంది వితంతువులు, 2,975మంది దివ్యాంగులు, 2,158మంది గీత కార్మికులు, 927మంది చేనేత కార్మికులు, 826మంది ఒంటరి మహిళలు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 94,952 మందికి చేయూత పింఛన్లు అందుతుండగా, కొత్తగా మంజూరైన లబ్ధిదారులతో ఈ సంఖ్య 1,09,053కు చేరనుంది. పింఛన్లు అర్హులకు నెలనెలా ఆర్థిక కలగనుంది.
మండలాల వారీగా ప్రొసీడింగ్స్ పంపిణీ
జిల్లాలో కొత్తగా ఆమోదం పొందిన చేయూత దరఖాస్తుదారులకు మండలాల వారీగా ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆదేశాల మేరకు గురువారం నుంచి ఈనెల 18వ తేదీవరకు జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాలు, మునిసిపాలిటీల్లో పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆయా మండలాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడంతో పాటు అభ్యంతరాలు, సమస్యలు, వాటి పరిష్కారానికి ఈ పంపిణీ కార్యక్రమ వేదిక వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని సెర్ప్ అధికారులు సూచించారు.
రామన్నపేటలో 1,380 దరఖాస్తులు
రామన్నపేట: కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోగా, గడువుముగిసే నాటికి రామన్నపేట మండలంలో 1,380 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి 958మందిని అర్హులుగా తేల్చారు. వీరికి అధికారులు పెన్షన్ ధ్రువపత్రాలు పంపిణీచేయనున్నారు.
జిల్లాలో చేయూత పింఛన్లు ఇలా..
కేటగిరీ కొత్తగా ప్రస్తుత మొత్తం
మంజూరు పింఛన్లు
వృద్ధాప్య - 34,738 34,738
వితంతు 7,215 35,492 42,707
దివ్యాంగులు 2,975 12,294 15,269
గీత కార్మికులు 2,158 5,467 7,655
చేనేత కార్మికులు 927 2,950 3,877
ఒంటరి మహిళలు 826 2,461 3,287
డయాలిస్ - 175 175
పైలేరియా - 465 465
బీడీ కార్మికులు - 910 910
మొత్తం 14,101 94,952 1,09,053