Share News

రోజూ 11 గంటలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:39 AM

ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఆస్తుల క్రయవిక్రయదారులకు ప్ర యోజనం చేకూర్చడంతోపాటు భారీగా ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రోజూ 11 గంటలు

ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ రిజిస్ట్రేషన్లశాఖ చర్యలు

28, 30, 31వ తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఆస్తుల క్రయవిక్రయదారులకు ప్ర యోజనం చేకూర్చడంతోపాటు భారీగా ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం చివరి మూ డు రోజుల్లో అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయనే భావనతో అదనపు స్లాట్ల కేటాయింపుతోపాటు పని వేళలను సైతం పెంచుతూ స్టాంపు లు రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 28, 30, 31 తేదీల్లో స్లాట్ల సంఖ్యను పెంచడంతోపాటు పని వేళలను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు ఏర్పాటు పూర్తిచేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. స్లాట్ల పెరుగుదల, పనివేళ పొడిగింపుతో ప్రధానంగా నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, చౌటుప్పల్‌, బీబీనగర్‌, భువనగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయాల్లో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్‌ చొప్పున ఉండగా, ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద 48 స్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉండగా, మొత్తంగా ఇద్దరు సభ్యులు ఉన్నచోట 96 స్లాట్లు ప్రతీ రోజు ఉంటున్నాయి. స్లాట్ల కేటాయింపు పెరగడంతో అదనంగా మరో 80 స్లాట్లు పెరిగాయి. కొన్నిచోట్ల ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ ఒక్కరే ఉంటే అదనంగా మరో సీనియర్‌ అసిస్టెంట్‌ను ఈ మూడు రోజుల పాటు ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమించి అదనపు స్లాట్‌ల కేటాయింపు ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించనున్నారు. ప్రభుత్వం ఆదాయాన్ని భారీగా సమకూర్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు ముందు ఆస్తుల క్రయవిక్రయదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం యాదగిరిగుట్ట, సూర్యాపేట, నల్లగొండలో ఇద్దరు చొప్పున సబ్‌ రిజిస్ట్రార్లు ఈ మూడు కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఒక్కోచోట 176 స్లాట్లు కేటాయించారు. ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌కు 88 స్లాట్‌లను కేటాయించారు. ఇక ఒక్కరు ఉన్న చోట 48 నుంచి 88 స్లాట్లకు పెరిగింది. ఒక్క సబ్‌ రిజిస్ట్రార్‌ ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందితో సేవలందిస్తారు.

ఆర్థిక సంవత్సరం ముగింపులో అదనంగా స్లాట్‌లు కేటాయిస్తున్నందున సిబ్బందిని కూడా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈనెల 29న ఆదివారం సెలవు దినం కావడంతో ఆ రోజు రిజిస్ట్రేషన్లశాఖ పనిచేయదు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ప్రతీ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. అయితే 28, 30, 31 తేదీల్లో మాత్రం పని వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 9.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆస్తుల క్రయవిక్రయ సేవలను రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అందిస్తారు. ఈ సమయంలో కార్యాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది అంతా అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం నిర్ణయంతో ఈ మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకున్న వారికి ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే చాలామంది ఆస్తుల క్రయవిక్రయదారులు స్లాట్‌లు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం.

అదనపు స్లాట్లతో వెసులుబాటు

రిజిస్ట్రేషన్లశాఖలో అదనపు స్లాట్ల కేటాయింపుతోపాటు పనివేళలు పొడిగించడం ద్వారా మూడు రోజులపాటు ఆస్తుల కొనుగోలు దారులకు వెసులుబాటు కాలగనుంది. అత్యధికంగా వెంచర్లు చేస్తూ రియల్‌ వ్యాపారం కొనసాగిస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలున్నాయి. సాధారణంగా ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌కు 48 చొప్పున స్లాట్‌లు ఉంటాయి. ఈ మూడు రోజుల్లో అదనంగా మరో 40 స్లాట్ల చొప్పున ప్రతీ సబ్‌ రిజిస్ట్రార్‌కు కేటాయించారు. చాలామంది పెట్టుబడిదారులకు సంబంధించి పన్ను ఆదా కోసం ఆర్థిక సంవత్సరం ముగింపులోపు రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో భూములు, ఇతర స్థిర, చర ఆస్తుల ధరలు పెరగడం, ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను సవరిస్తే ఆర్థిక భారం పడుతుందని భావించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే రిజిస్ట్రేషన్‌కు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువలను సవరించే అవకాశం ఉందనే చర్చ సాగింది. దీన్ని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసినా, నూతన ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్కెట్‌ విలువలను సవరించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాత స్టాంపు డ్యూటీ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపే రిజిస్ట్రేషన్లకు అత్యధిక మంది మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఐటీ రిటర్న్‌ సమర్పించడం కోసం ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు ప్రస్తుతం ఉన్న స్టాంప్‌ డ్యూటీతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ఆస్తుల క్రయ విక్రయదారులపై ఆర్థిక భారం తక్కువగా ఉండనుంది.

సద్వినియోగం చేసుకోవాలి : ఎం.రవీందర్‌రావు, డీఆర్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఆస్తుల క్రయ, విక్రయదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 28, 30, 31వ తేదీల్లో మూడు రోజులపాటు ఉదయం 9.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారు. ఆర్థిక సంవత్సరం చివరి మూడు రోజులను ఆస్తుల క్రయవిక్రయదారులు ఉపయోగించుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.

Updated Date - Mar 28 , 2026 | 12:39 AM