Share News

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..

ABN , Publish Date - Jun 30 , 2026 | 03:27 PM

2022 నాటి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు..
MLA Raja Singh

హైదరాబాద్, జూన్ 30: 2022 నాటి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలించిన కోర్టు.. రాజాసింగ్‌పై మోపిన ఆరోపణలు ఏవీ సరైనవి కావని నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పును వెలువరించింది.


కేసు వివరాలు..

2022, ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహించడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మునావర్ షోను నిరసిస్తూ యూట్యూబ్ ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153A(a)(b), 295A , 504, 505(2), 506 కింద కేసులు నమోదయ్యాయి.


2022 ఆగస్టు 23వ తేదీన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే, అరెస్ట్ ప్రక్రియలో పోలీసులు సరైన నిబంధనలు పాటించలేదంటూ స్థానిక కోర్టు రిమాండ్‌ను తిరస్కరించింది. ఆయనను వెంటనే విడుదల చేసింది. రాజాసింగ్ విడుదల తర్వాత నగరంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు 2022, ఆగస్టు 25వ తేదీన మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో రాజాసింగ్ 77 రోజుల పాటు జైలులో ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

బెన్ స్టోక్స్‌ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!

Updated Date - Jun 30 , 2026 | 03:33 PM