కాంగ్రెస్ ఇన్‌చార్జి బాధ్యతలు వీడనున్న మీనాక్షి!
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:49 AM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మీనాక్షి నటరాజన్ తప్పుకోనున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినె్‌సలో ఆర్థికశాస్త్రం విభాగానికి సంబంధించి పది నెలల కోర్సులో చేరుతున్న నేపథ్యంలో ఆమె ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారు.
కొత్త ఇన్‌చార్జిగా ముగ్గురి పేర్ల పరిశీలన
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మీనాక్షి నటరాజన్ తప్పుకోనున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినె్‌సలో ఆర్థికశాస్త్రం విభాగానికి సంబంధించి పది నెలల కోర్సులో చేరుతున్న నేపథ్యంలో ఆమె ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారు. ఈ నెల 18న ఆమె పార్టీ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న లండన్‌కు ప్రయాణం అవుతున్నట్లు వెల్లడించాయి. వాస్తవానికి ఈ కోర్సులో చేరేందుకు ఆమెకు కొద్ది నెలల కిందటే సీటు వచ్చినా.. ఆర్థిక స్థోమత లేక చేరలేదు. తాజాగా లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కాలర్ షిప్పూ మంజూరు చేయడంతో ఆ కోర్సులో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు చెప్పేశారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితుడు ఎస్. చెల్ల కుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ముకుల్ వాస్నిక్, పార్టీ సీనియర్ నేత శక్తి సిన్హా గోహిల్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కడిక్కున్నిల్ సురేష్ పేర్లను అధిష్ఠానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణకు కొత్త ఇన్‌చార్జిని నియమించనున్నట్లు తెలుస్తోంది