వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Oct 03 , 2026 | 05:30 AM
ప్రియుడి వద్ద ఉన్న తన బంగారు గొలుసును తీసుకునేందుకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఓ హోటల్ రూములో శవమై కనిపించింది.
ప్రియుడిని కలిసేందుకు వచ్చి.. హోటల్ రూములో శవమై తేలిన యువతి
హైదరాబాద్‌లోని మియాపుర్‌లో ఘటన
మియాపూర్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రియుడి వద్ద ఉన్న తన బంగారు గొలుసును తీసుకునేందుకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఓ హోటల్ రూములో శవమై కనిపించింది. ఈ ఘటన మియాపూర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన కోమటి భూమయ్య రెండో కుమార్తె కోమటి సృజన.. మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసి, వరంగల్‌లో పీడియాట్రిషన్ విభాగంలో పీజీ మొదటి ఏడాది చదువుతోంది. ఆమెకు ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన రవి (30)తో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో సృజన అతడికి బంగారు గొలుసు ఇచ్చింది. ఇద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరగడంతో తన గొలుసు తిరిగి ఇచ్చేయమని కోరగా.. రవి మియాపూర్‌కు రమ్మని చెప్పాడు. దీంతో సెప్టెంబరు 30న సృజన వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే రవి సెప్టెంబరు 29 నుంచి మియాపూర్‌లోని ఓ హోటల్‌లో రూము తీసుకుని ఉంటుండడంతో అతడి వద్దకు వచ్చింది. ఈనెల 1న రూము నుంచి రవి వెళ్లిపోయాడు. రెండు రోజులుగా సృజన ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆమె తండ్రి వరంగల్‌కు వెళ్లి ఆరా తీసి, అక్కడే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా సృజన.. మియాపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించి ఇక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. మియాపూర్ పోలీసులు హోటల్ రూముకు వెళ్లి చూడగా.. సృజన మంచంపై నిర్జీవంగా పడిఉంది. ఆమె ముఖం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, ఆమె తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.