వనమంతా జనమై..
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:42 AM
సాధారణంగా మేడారం మహాజాతరలో ఎప్పుడూ రెండోరోజే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క గద్దె చేరిన 24 గంటల తర్వాత జాతర పలుచబడుతుంది.
మేడారానికి అనూహ్యంగా పోటెత్తిన భక్తులు.. క్యూలైన్ల వద్ద అదుపు తప్పిన పరిస్థితి
రద్దీ నియంత్రణకు లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
వీఐపీల తాకిడి పెరగడంతో ఇబ్బందిపడ్డ భక్తులు
జనజాతరను తలపించిన బస్టాండ్ ప్రాంగణం
తల్లులను దర్శించుకున్న గవర్నర్, మీనాక్షి నటరాజన్
ట్రాఫిక్ సమస్యలు.. 15 కి.మీ మేర నిలిచిన వాహనాలు
మేడారం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా మేడారం మహాజాతరలో ఎప్పుడూ రెండోరోజే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క గద్దె చేరిన 24 గంటల తర్వాత జాతర పలుచబడుతుంది. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. మూడోరోజు భక్తులు వరదలా పోటెత్తారు. ఫలితంగా శుక్రవారం జాతరలో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. జాతర ప్రాంగణమంతా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. జంపన్నవాగు, బస్టాండ్ ప్రాంగణం ఇలా ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం కనిపించారు. ప్రత్యేకించి క్యూలైన్ల వద్ద భక్తులను నియంత్రించడం పోలీసులకు సవాలుగా పరిణమించింది. గద్దెల వద్ద వెళ్లే అన్ని ప్రధాన ద్వారాల వద్ద భక్తులు కిక్కిరిసిపోవడంతో లోపలివారు బయటకు రాలేని పరిస్థితి.. అలాగే బయటి వారు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇది తొక్కిసలాటకు దారితీసింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లైన్లలో ఊపిరాడక చిన్నారులు గుక్కపెట్టి ఏడ్చారు. ఓ చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. క్యూలైన్‌లో నిల్చున్నవారికి తాగేందుకు నీళ్లు లేక వారి గొంతులు దప్పికతో తడారిపోయాయి. కొందరు అస్వస్థతకు గురయ్యారు. గద్దెల వద్ద కొబ్బరి కాయలు, బెల్లం బుట్టలు తగిలి పలువురికి గాయాలయ్యాయి. రద్దీని నియంత్రించడానికి పోలీసులు పలుమార్లు లాఠీలకు పనిచెప్పారు. ఒకదశలో రద్దీని తగ్గించేందుకు వీఐపీల క్యూలైన్లలోకి సాధారణ భక్తులను అనుమతించారు. అయితే సాధారణ క్యూలైన్లో నిల్చున్నవారంతా వీఐపీ క్యూలైన్ల వైపు పరుగులు తీయడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు గద్దెల వద్దకు చేరుకోవడానికి ఐరన్ గ్రిల్స్‌ను దూకాల్సివచ్చింది. గద్దెలను దర్శించుకున్న భక్తులు తిరుగుముఖం పట్టడంతో మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ జనంతో కిక్కిరిసిపోయింది. సరిపడా బస్సులు లేకపోవడంతో భక్తులంతా అక్కడే తిష్టవేయడంతో జాతరంతా బస్టాండ్‌కు మారినట్లయింది. మూడోరోజు శుక్రవారం కూడా భక్తులు జోరుగా మొక్కులు సమర్పించుకున్నారు. తల్లుల దర్శనాలు నిరంతరాయంగా కొనసాగాయి. దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటలు పట్టింది. ట్రాన్స్‌జెండర్లలో కొందరు ఎంతసేపు వేచి ఉన్నా దర్శనం కాకపోవడంతో సహనం నశించి ప్రధాన గేట్ ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. భక్తుల తాకిడి పెరగడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
కొండా సురేఖ నృత్యం
జాతరకు వచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం తల్లులను దర్శించుకున్నారు. గద్దెల ప్రధాన గేట్ వద్ద మంత్రి సీతక్క సురేఖకు స్వాగతం పలికారు. గద్దెల వద్దకు తోడ్కొని పోయి దర్శనం చేయించారు. అనంతరం సురేఖ పోలీసు కంట్రోల్ రూం ప్రాంగణంలో కోయ కళాకారుల నృత్య ప్రదర్శనను తిలకించారు. వారితో కలిసి గుస్సాడి నృత్యంలో పాల్గొన్నారు. సరదాగా స్టెప్పులు వేశారు.
పెరిగిన వీఐపీల తాకిడి
వీఐపీల తాకిడి శుక్రవారం పెరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారాన్ని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం హెలిప్యాడ్‌లో దిగారు. ఆయనకు మంత్రి సీతక్క, కలెక్టర్ టీఎస్ దివాకర్ స్వాగతం పలికారు. గవర్నర్ నిలువెత్తు బంగారాన్ని సమర్పించి.. తల్లులను దర్శించుకున్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినీ హాస్య నటుడు శివారెడ్డి దంపతులు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఆర్‌టీసీ ఎండీ. వై.నాగిరెడ్డి.. వనదేవతలను దర్శించుకున్నారు.



