Share News

రూ.3 లక్షలకు ఆడ శిశువు విక్రయం

ABN , Publish Date - May 14 , 2026 | 03:46 AM

మెదక్‌లోని లైఫ్‌కేర్‌ ఆస్పత్రిలో ఓ నర్సు అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులను నమ్మించి శిశువును అమ్మేసిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చూసింది.

రూ.3 లక్షలకు ఆడ శిశువు విక్రయం

  • అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండడంతో నాలుగో సంతానాన్ని అమ్మేసిన తల్లిదండ్రులు

  • మెదక్‌ జిల్లాలో తొమ్మిది మంది అరెస్టు

మెదక్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): మెదక్‌లోని లైఫ్‌కేర్‌ ఆస్పత్రిలో ఓ నర్సు అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులను నమ్మించి శిశువును అమ్మేసిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగు చూసింది. అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్న దంపతులకు నాలుగో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టగా వారు ఆ బిడ్డను మధ్యవర్తుల సహాయంతో రూ.3 లక్షలకు అమ్మేశారు. అంగన్‌వాడీ కార్యకర్త వల్ల ఈ విషయం బయటపడగా.. శిశువు తండ్రి పరారీలో ఉండగా తల్లితో పాటు బిడ్డను కొనుగోలు చేసిన దంపతులు, మధ్యవర్తులు కలిసి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్‌, శిరీష దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో సారి గర్భం దాల్చిన శిరీష్‌ మెదక్‌ మాతాశిశు కేంద్రంలో మార్చి నెలలో మళ్లీ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అయితే, సిద్దిపేట జిల్లా అల్లీనగర్‌కు చెందిన కమలమ్మ, లింగయ్య దంపతులకు సంతానం లేరు. వీరు మధ్యవర్తుల ద్వారా దేవీసింగ్‌, శిరీష దంపతుల నుంచి నవజాత శిశువును రూ.3లక్షలకు కొనుగోలు చేశారు. ఆ శిశువును తమ వెంట తీసుకెళ్లిపోయారు. అయితే, శిరీష గర్భంతో ఉండగా స్థానిక అంగన్‌వాడీ కేంద్రం నుంచి సరుకులు తెచ్చుకునేది. ప్రసవం తర్వాత ఆమె వద్ద బిడ్డ లేకపోవడంతో తండా అంగన్‌వాడీ కార్యకర్త గమనించి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌కు సమాచారం అందించింది. వారు తండాలో విచారణ జరపగా శిశువిక్రయం సంగతి తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విక్రయించిన శిశువును.. శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సోనీ అనే మహిళ ఈ శిశువిక్రయానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు పోలీసులు తేల్చారు.

Updated Date - May 14 , 2026 | 03:46 AM