Share News

ఆ ప్రమాదం వెనుక సీఎం రేవంత్ హస్తం: హరీశ్ రావు

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:19 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని హరీశ్ రావు తెలిపారు.

ఆ ప్రమాదం వెనుక సీఎం రేవంత్ హస్తం:  హరీశ్ రావు
BRS MLA Harish Rao

మెదక్, ఫిబ్రవరి 09: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. సోమవారం మెదక్‌లో హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేశారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే సాక్ష్యాలను మాయం చేశారంటూ తెలంగాణ సీఎంపై ఆయన మండిపడ్డారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరిలో జరిగిన ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదన్నారు. ఇది సీఎం రేవంత్ డైరెక్షన్‌లో జరిగిందంటూ ఆయన బల్లగుద్ది చెప్పారు. ఈ ప్రమాదం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అంటూ రేవంత్‌ని వ్యాఖ్యానించారు.


జైలుకు పోయే సమయం ఆసన్నమైందని.. అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైద్రాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేశారంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలీసుల సహకారంతోనే సీఎం ఈ కుట్రపన్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ డైరెక్షన్‌లోనే పోలీసులు చేసిన దహనఖాండ ఇది అని అభివర్ణించారు. రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గుండు సున్నా అని రేవంత్ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్‌లలో భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. కానీ మెదక్‌కు వచ్చేందుకు ఆయనకు ముఖం చెల్లలేదంటూ సీఎం రేవంత్‌‌ను ఎద్దేవా చేశారు. రైతు బంధు ఎగ్గొట్టారు.. రాష్ట్రంలో ఎరువుల కరువు తెచ్చారంటూ రేవంత్‌ ప్రభుత్వ పాలనను ఈ సందర్భంగా హరీశ్ రావు ఎండగట్టారు. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 06:45 PM