Share News

దోమల ఫాగింగ్‌లో భారీ స్కాం.. పంపకాల్లో తేడా రావడంతో..

ABN , Publish Date - Feb 24 , 2026 | 07:35 PM

జీహెచ్ఎంసీ పరిధిలో దోమల ఫాగింగ్ వ్యవహారంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో స్కాం బయటపడింది..

దోమల ఫాగింగ్‌లో భారీ స్కాం.. పంపకాల్లో తేడా రావడంతో..
Hyderabad mosquito fogging

హైదరాబాద్, ఫిబ్రవరి 24: జీహెచ్ఎంసీ పరిధిలో దోమల ఫాగింగ్ వ్యవహారంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో స్కాం బయటపడింది. ప్రతి ఏటా దోమల నియంత్రణకు ప్రభుత్వం రూ.32 కోట్లు ఖర్చు చేస్తోంది. బల్దియా ఉన్నతాధికారులు దోమల ఫాగింగ్ కోసం మల్కాజిగిరి సర్కిల్‌కి రోజూ 84 లీటర్ల డీజిల్ కేటాయించారు. 84 లీటర్లలో కేవలం 24 లీటర్ల డీజిల్‌తో దోమల ఫాగింగ్ చేసి.. మిగతా డీజిల్ పక్కదారి పట్టించారు ఎంటమాలజీ సిబ్బంది. పెట్రోల్ బంక్‌కి లీటర్ డీజిల్‌కి పది రూపాయల కమీషన్ ఇచ్చి.. మిగతా డబ్బులు తీసుకున్నారు.


ఫాగింగ్ చేసే సిబ్బందికి ప్రతి నెలా 5 వేల రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు సూపర్ వైజర్, ఏఈ, ఎస్ఈ పంచుకున్నారు. సూపర్ వైజర్ ఫాగింగ్ సిబ్బందికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపారు. విషయం బయటకి తెలియడంతో ఉన్నతాధికారులు సూపర్ వైజర్‌ను తీసేశారు. పంపకాల్లో తేడా వచ్చి విషయం బయట పెట్టిన ఫాగింగ్ చేసే వర్కర్‌ను.. ఇతర సిబ్బంది, ఎంటమాలజీ అధికారులు బెదిరించారు.


ఎంటమాలజీలో డీజిల్ పక్కదారి పడుతోందని తెలియడంతో.. అధికారులు గత మూడు నెలల నుంచి డీజిల్‌లో మెలాథిన్ కెమికల్‌ను కలిపి ఇస్తున్నారు. ఇప్పుడు డీజిల్ అమ్ముకునే ఛాన్స్ లేకపోవడంతో ఫాగింగ్ చేయకుండా పని తప్పించుకోవడానికి మెలాథిన్ కెమికల్‌ కలిపిన డీజిల్‌ను సిబ్బంది డ్రైనేజీలో పారబోస్తున్నారు. ఏటా రూ.32 కోట్లు ఖర్చు చేస్తున్నా.. నిధులు భారీగా పక్కదారి పడుతుండటంతో నగరవాసులకు దోమల బెడద తప్పటం లేదు.


ఇవి కూడా చదవండి..

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి లగ్జరీ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?

వాళ్లు ఎవరికీ భయపడని బబ్బర్ షేర్స్.. రాహుల్ కితాబు

Updated Date - Feb 24 , 2026 | 07:51 PM