Share News

వరంగల్‌ ఎయిర్‌పోర్టు పనుల్లో భారీ కదలిక

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:43 AM

వరంగల్‌ ఎయిర్‌పోర్టు పనుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) తొలి టెండర్‌ను ఖరారు చేసి.. కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది.

వరంగల్‌ ఎయిర్‌పోర్టు పనుల్లో  భారీ కదలిక
WGL AIR PORT IMAGINARY PICTURE

  • రూ.13.29 కోట్లతో

రక్షణగోడ నిర్మాణానికి టెండర్‌ ఖరారు

  • అంచనా వ్యయం 21.39 కోట్లలో

  • 37.89 శాతం తక్కువకే..

  • పనులు చేసేందుకు ముందుకొచ్చిన

    హైదరాబాద్‌ సైదాక్స్‌ సంస్థ

  • ఈ నెల 9న పనులు ప్రారంభం..

  • 15 నెలల్లో పూర్తి చేసేలా ఒప్పందం

వరంగల్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్‌ ఎయిర్‌పోర్టు పనుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) తొలి టెండర్‌ను ఖరారు చేసి.. కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.285 కోట్లు వెచ్చించి సేకరించిన 283 ఎకరాల భూమికి రక్షణ గోడతోపాటు ప్రస్తుతం ఉన్న పాత ప్రహరీ ఎత్తు పెంచేందుకు హైదరాబాద్‌కు చెందిన సైదాక్స్‌ ఇంజనీర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు పనులు అప్పగించింది. అందరి కంటే తక్కువ ధరకు పనులు చేసేందుకు సైదాక్స్‌ కంపెనీ ముందుకు రావడంతో సెప్టెంబరు 29న కాంట్రాక్టును ఖరారు చేసింది. కొత్తగా సేకరించిన భూమికి రక్షణగోడతోపాటు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) నింబంధనలకు అనుగుణంగా పాత ప్రహరీ ఎత్తు పెంచేందుకు ఏఏఐ రూ.21,39,52,823 అంచనా వ్యయంతో టెండర్‌ పిలవగా, సైదాక్స్‌ కంపెనీ రూ.13,28,86,521.60కే ఈ పనిని పూర్తి చేసేందుకు టెండర్‌ దాఖలు చేసింది. అంచనా వ్యయం కన్నా 37.89 శాతం తక్కువకే పనులు చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వానికి రూ.8,10,66,301.40 ఆదా కానున్నాయి. కాగా, ఈ పనులను ఈ నెల 9న ప్రారంభించి 15 నెలల్లో పూర్తిచేయాలని ఏఏఐ పేర్కొంది. అంతేకాకుండా కాంట్రాక్టు ఖరారైన నాటి నుంచి 15 రోజుల్లో అంటే.. ఈ నెల 14వ తేదీలోగా కాంట్రాక్టు పొందిన సైదాక్స్‌ కంపెనీ హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టులోని ఏఏఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయానికి వచ్చి అధికారిక ఒప్పందం చేసుకోవాలని సూచించింది.


ఇక పర్యావరణ అనుమతులే ఆలస్యం..

తొలి టెండర్‌ ఖరారుతో మామునూరు విమానాశ్రయం పనుల్లో భారీ కదలిక వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పర్యావరణ అనుమతుల విషయంలో కొంత ఆలస్యం కావచ్చనే చర్చ జరుగుతోంది. విమానాశ్రయ ప్రధాన రన్‌వే విస్తరణ, డొమెస్టిక్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనుల ప్రారంభానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని, గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు సేకరించిన మూడు నెలల బేస్‌లైన్‌ డేటా గడువు ముగియడంతో ఏఏఐ 2027 జనవరిలో తాజా పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేయనుందని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి వచ్చే ఏడాది మార్చి నుంచి జూన్‌ చివరినాటికి అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. క్లియరెన్స్‌ వచ్చిన వెంటనే 2027 ఏప్రిల్‌- జూన్‌ మధ్య రన్‌వే కార్పెటింగ్‌, టెర్మినల్‌ బిల్డింగ్‌, ఏటీసీ టవర్ల ప్రధాన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులన్నీ 2028 జూన్‌ 2వ తేదీ నాటికి పూర్తి చేసి ఓరుగల్లు గగనమార్గంలో విమానాన్ని చక్కర్లు కొట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Updated Date - Oct 03 , 2026 | 04:50 AM