రంగారెడ్డి జిల్లాలో బాల నేరస్థుల అరెస్ట్.. 8 బైక్‌ల స్వాధీనం
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:58 PM
మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో వరుసగా జరుగుతున్న బైక్ చోరీలకు పోలీసులు చెక్ పెట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు బాల నేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మైలార్‌దేవ్‌పల్లి, సెప్టెంబర్ 29: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బాల నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున టీఎన్జీవోస్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన యాక్టివా వాహనం చోరీకి గురైంది. అదే సమయంలో సమీపంలోని గణేశ్ పండల్‌లో ఉన్న స్పీకర్‌ను కూడా వారు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు బాలురను గుర్తించి, విచారణ చేపట్టడంతో వరుస చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇద్దరు బాల నేరస్థుల నుంచి మొత్తం ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన బైక్‌లను కూడా వీరు అపహరించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. చోరీకి గురైన వాహనాలను గుర్తించి వాటి యజమానులకు అప్పగించే చర్యలను పోలీసులు చేపట్టనున్నారు. సీసీటీవీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు, బాల నేరస్తులు మరిన్ని చోరీలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్
కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ