Share News

రెండేళ్ల ప్రయాణం సంతృప్తిగా సాగింది

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:05 AM

టీపీసీసీ అధ్యక్షుడిగా తన రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిందని మహేశ్‌ కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డితో తన వేవ్‌ లెంగ్త్‌ సరిగ్గా సరిపోయిందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు

రెండేళ్ల ప్రయాణం సంతృప్తిగా సాగింది
maheshkumar

  • టీపీసీసీ చీఫ్‌ పదవిని బాధ్యతగా నిర్వహించా

  • సీఎం రేవంత్‌తో ఎలాంటి విభేదాలు లేవు

  • మీడియాతో చిట్‌చాట్‌లో మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా తన రెండేళ్ల ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిందని మహేశ్‌ కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డితో తన వేవ్‌ లెంగ్త్‌ సరిగ్గా సరిపోయిందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమేనని, ఏవైనా పొరపొచ్చాలు వచ్చినా సాయంత్రానికల్లా సరి చేసుకుంటామని పేర్కొన్నారు. టీపీసీసీ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం సీఎల్పీలో విలేకరులతో నిర్వహించిన చిట్‌ చాట్‌లో మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్‌ పార్టీని బూత్‌ స్థాయు వరకూ బలోపేతం చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో చేపట్టిన కుల సర్వేతో నిజమైన సామాజిక న్యాయం సాకారమైందని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కూడా కులగణన నిర్వహిస్తుందని చెప్పారు. అలాగే స్థానిక ఎన్నికల్లోనూ బీసీలకు పెద్దపీట వేశామని వివరించారు. మంత్రివర్గం నుంచి బీసీ నేత కొండా సురేఖను తొలగించినప్పుడు బాధ పడ్డానని మహేశ్‌ కుమార్‌గౌడ్‌ తెలిపారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే ఆమెపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇకపై నామినేటెడ్‌ పదవులు, స్థానిక నియామకాలు, అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో డీసీసీ అఽధ్యక్షులు, మండల అధ్యక్షుల అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఈ నెలాఖరుకల్లా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.


టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్‌గౌడ్‌ రెండేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా గాంధీభవన్‌లో నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఇదే సమయంలో మహిళా కాంగ్రెస్‌ 42వ వ్యవస్థాపక దినోత్సవం కూడా గాంధీభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి మహేశ్‌గౌడ్‌ కేక్‌ కట్‌ చేశారు.

Updated Date - Sep 16 , 2026 | 06:05 AM