బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ చాటాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:39 PM
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటాలని జిల్లా వాలీబాల్, కబడ్డీ సంఘ అధ్యక్షుడు శాంతికుమార్ పేర్కొన్నారు.
- జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయం
- జిల్లా వాలీబాల్, కబడ్డీ సంఘ అధ్యక్షుడు శాంతికుమార్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చాటాలని జిల్లా వాలీబాల్, కబడ్డీ సంఘ అధ్యక్షుడు శాంతికుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సీనియర్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ (జయప్రకాశ్ నారయణ్ ట్రోఫి)ను శనివారం మూడో రోజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి, మాట్లాడారు. జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలను నిర్వహించడంతో కళాశాల చైర్మన్ కె.ఎస్.రవికుమార్‌ను అభినందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులు మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమాని, క్రీడాస్పూర్తి చాటాలన్నారు. జేపీఎన్‌సీఈ కళాశాల చైర్మన్ కే.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ మూడు రోజులుగా క్రీడాకారులు ఎంతో ఉత్సహంగా పోటీల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం టోర్నీ ముగింపు ఉంటుందని తెలిపారు. ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫేడరేషన్ (ఐఏబీఎఫ్) సెక్రటరీ రాకేష్ తాక్రాన్, రఘువీర్‌సింగ్, కళాశాల కార్యదర్శి వెంకటరామారావు, సి.భాస్కర్, విశ్రాంత ఉద్యోగులు రాజేంద్రకుమార్, నాగేశ్వర్, పోకల శివుడు, నాగభూషణ పాల్గొన్నారు.
బాక్సింగ్ పోటీల ఫలితాలు
బాక్సింగ్ పోటీల్లో శనివారం మూడో రోజు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో వివిధ కేటరిరీల్లో ఆయా రాష్ట్రాల క్రీడాకారులు గెలుపొందారు. దేవేంద్రసింగ్ సోలాంకి (రాజస్థాన్), సాయిస్వరూప్ (ఆంధ్రప్రదేశ్), హనీఓహ్లన్ (హర్యానా), షోమోరోజిత్ (కర్ణాటక), యోగేష్ (హర్యానా), మోహిత్‌ఠాకూర్ (ఉత్తరప్రదేశ్), అకింత్‌కుమార్ (హర్యానా), సుఖ్‌దేవ్ (ఢిల్లీ), జయదీప్‌రావత్ (ఉత్తరఖాండ్), సోహెల్ (అస్సాం), పర్వ (హర్యానా), ఆకాష్ (పంజాబ్), జయవర్ధన్‌రెడ్డి (లక్షదీవ్) గెలుచి ఫైనల్స్‌కు చేరారు.