సరైన పత్రాలతో విచారణకు రావాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:27 PM
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
- దేవరకద్ర నియోజకవర్గంలో 77,535 ఓటర్లకు నోటీసులు
- వారం రోజులు గడువు విధించిన అధికారులు
దేవరకద్ర, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని దేవరకద్ర, భూత్ఫూర్, అడ్డాకుల, మూసాపేట, చిన్నచింతకుంట, కౌకుంట్ల, మదనాపూర్, కొత్తకోట మండలాల వ్యాప్తంగా మొత్తం 2,16,460 మంది ఓటర్లు ఉండగా, అందులో 77,535 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వయస్పు, ఇంటి నెంబర్లతో పాటు పేరులో, కుటుంబ సభ్యుల వివరాల్లో తప్పులు గుర్తించిన అధికారులు దేవరకద్ర మండలంలో 13,024, అడ్డాకుల మండలంలో 6,794, భూత్ఫూర్ మండలంలో 11,201, చిన్నచింతకుంట మండలంలో 9,190, మూసాపేట మండలంలో 6,156, కౌకుంట్ల మండలంలో 5,228, మదనాపూర్ మండలంలో 6,729, కొత్తకోట మండలంలో 17,235 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయానికి ధ్రువపత్రాలు తీసుకొని రావాలని బీఎల్‌వోలు సూచిస్తున్నారు. 2002 రికార్డుతో లింక్ కాని వారికి కూడా అధికారులు నోటీసులు పంపించారు. మొదటి నోటీసు అందుకున్న ఓటర్లు గడువులోగా విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో సరైన పత్రాలు చూపకపోయినా, మరోమారు నోటీసులు పంపి ఓటును తొలగించే అవకాశం ఉంది. నోటీసు అందుకున్న ఓటర్లు జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, పదో తరగతి లేదా విద్యా అర్హత సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, పట్టా పాస్ పుస్తకం, ఆధార్‌కార్డుతో హాజరుకావల్సి ఉంటుంది.
పత్రాలు చూపాల్సిందే.. మహ్మద్ అర్హద్, తహసీల్దార్ దేవరకద్ర.
నోటీసులు తీసుకున్న ఓటర్లు విచారణ సమయంలో తప్పకుండా హాజరుకావాలి. ఆధార్‌కార్డు తదితర ఏదైన గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. పత్రాలు సరిగ్గా ఉంటే ఓటులో వివరాలను సరి చేస్తాం.