నీటి సంపులో దూకి ఇద్దరు పిల్లలు సహా మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:29 PM
ఇద్దరు పిల్లలతో సహా నీటిసంపులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది.
- నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లిలో ఘటన
వెల్దండ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు పిల్లలతో సహా నీటిసంపులో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఎనుముల మల్లేష్‌కు మూడేళ్ల క్రితం పదర గ్రామానికి చెందిన శిరీషతో(23) వివాహమైం ది. వారికి రెండేళ్ల మానశ్రీ, మూడు నెలల వర్షిత్‌లు ఉన్నారు. కాగా శుక్రవారం మల్లేష్ తన తండ్రి వెంకటయ్య, తల్లి వెంకటమ్మతో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో ఇంటి గేటు లోపలికి రాగానే ఎదురుగా ఉన్న నీటి సంపులో పడి శిరీష, మానశ్రీ, వర్షిత్‌లు మునిగి చనిపోయి కనిపించారు. వెంటనే స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతోనే శిరీష ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునన్న అనుమానం స్థానికుల్లో నెలకొన్నది. మృతురాలి భర్త, మామలు ఇటీవల పక్షవాతానికి గురికావడంతో మానసికంగా తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చనే అభి ప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఏదిఏమైనా ఏతప్పూ చేయకున్నా తమ చిన్న పిల్లలను సంపులో వేసి శిరీష కూడా ఆత్మహత్యకు పాల్పడటం పలువురిని కలిచివేసింది.