Share News

ముంచుతారా? గట్టెక్కిస్తారా?

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:35 PM

కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులు గెలవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. తొక్కని గడపలేదు, మొక్కని దేవుళ్ళు లేరు. చివరకు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేశారు.

ముంచుతారా? గట్టెక్కిస్తారా?

లెక్కలేసుకుంటున్న అభ్యర్థులు

పోలైన సామాజిక వర్గాల ఓట్ల వివరాల సేకరణ

కాకిలెక్కలతో గెలుపుపై ఎవరికి వారు ధీమా

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులు గెలవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. తొక్కని గడపలేదు, మొక్కని దేవుళ్ళు లేరు. చివరకు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో కొందరు రూ.లక్షలు ఖర్చు చేస్తే.. మరికొందరు రూ.కోట్లు తగలేశారు. అంతా చేసినా ఓటర్లు తమను ముంచుతారా?.. తేల్చుతారా? అన్న టెన్షన్‌ వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సొమ్ము పోయినా ఓడితే పరువు పోతుందనుకునే వారు కొందరైతే.. ఓడితే రాజకీయ జీవితం కైలాసపటంలో పెద్దపాము మింగినట్లుగా మరికొందరి భవిష్యత్తు పాతాళానికి పడిపోనుంది. దీంతో అభ్యర్థులు పోలింగ్‌ అయిన తరువాత ఏజెంట్ల ఓటరు లిస్ట్‌ ఆధారంగా పోల్‌ అయిన ఓటర్ల సామాజిక లెక్కలు తీస్తున్నారు. ఏయే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎన్ని పోలయ్యాయి? అందులో తమకు అనుకూలంగా ఉన్నవి ఎన్ని? ప్రతికూలంగా ఉన్నవి ఎన్ని? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ప్రాంతాల వారీగా పోలైన లెక్కలు కూడా తీస్తున్నారు. వాటి ఆధారంగా తమకు ఎన్ని ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది?, ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు రావచ్చు? అని అంచనా వేస్తున్నారు. గెలుపుధీమా ఉన్న మరికొందరు మాత్రం మెజారిటీ ఎంతొస్తుందన్న లెక్కలు తీస్తున్నారు. ఎవరికి వాళ్లు కాకిలెక్కలతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుచరులు కూడా నాయకులను మెప్పించేందుకు ఫలానా చోట మనకు ఇన్ని ఓట్లు వస్తున్నాయని, తక్కువ ఓట్లతోనైనా మనం గెలుస్తున్నామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్స్‌లకు చేరింది. అందులో ఏముందన్నది ఈనెల 13న తేలనుంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులలో టెన్షన్‌ అంతకంతకు పెరుగుతోంది.

Updated Date - Feb 11 , 2026 | 11:35 PM