దీర్ఘకాల హామీలకు దారి దొరికేనా..?
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:01 AM
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పర్యటనపై నల్లమల ప్రాంతంలోని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
- ఎలివేటెడ్ కారిడార్ కార్యరూపం కోసం ప్రజల ఎదురుచూపు
- బుల్లెట్ రైలు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
- ఉమామహేశ్వర రిజర్వాయర్, పర్యాటక అభివృద్ధికి విన్నపాలు
- రూ. 450 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పర్యటనపై నల్లమల ప్రాంతంలోని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండటం లేదా నత్తకు నడక నేర్పుతున్నట్లు సాగుతున్న పనులు వేగం పుంజుకుంటాయని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన ప్రాంతం కావడం, ఇప్పటికే పలు పథకాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం విదితమే. నేటి పర్యటనలోనూ రాజ్యంగ దినోత్సవం సందర్భంగా ఇటీవల మంజూరు చేసిన చేయూత పింఛన్‌దారులకు నగదు జ మ, ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నల్లమల కేంద్రంగా కొన్ని పనులపై సీఎం స్పష్టత ఇచ్చి.. నిధుల విడుదలతో అభివృద్ధిని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నారు. సీఎం పర్యటనలో భాగంగా రూ. 450.075 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అత్యంత కీలకంగా మద్దిమడుగులో రూ. 15 కోట్లతో పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 18 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, ప్రత్యేకంగా కేటాయించిన 20 ఎకరాల స్థలంలో రూ. 38 కోట్ల వ్యయంతో సంత్ సేవాలాల్ భారీ విగ్రహం ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. అక్కడే నిర్వహించనున్న ప్రత్యేక సభలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలిరానున్న దాదాపు 5 వేల మంది గిరిజనులు పాల్గొననున్నారు. అనంతరం అచ్చంపేటకు వెళ్లి.. రూ. 274.32 కోట్లతో నాగర్‌కర్నూలు జిల్లాలో బీటీ రోడ్ల కు శంకుస్థాపనలు చేస్తారు. రూ. 29.65 కోట్లతో నాగర్‌కర్నూలు, పెద్దకొత్తపల్లి, వెల్దండ మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూ ల్ పనులకు శ్రీకారం చుడతారు. రూ. 25 కోట్లతో అచ్చంపేట మునిసిపాలిటీ అభివృద్ధి, రూ. 19.05 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు గదులు, రూ. 16 కోట్ల తో అచ్చంపేట నీటి సరఫరా మౌలిక సదుపాయాలు, రూ. 14 కోట్లతో మన్ననూరు నూతన ఐటీడీఏ భవనం, రూ. 2 కోట్లతో అచ్చంపేటలో ఆదివాసీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అయితే వీటితో పాటు చాలా రోజులుగా హామీలు మిగిలిపోవడం లేదా ఆచరణలో అడుగు ముందుకు పడకపోవడం, పడినా పనులు వేగం కాని ప్రాజెక్టుల పనుల విషయంలో సీఎం స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
ఎలివేటెడ్ కారిడార్ ఏమైనట్లు?
అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో 166 చదరపు కిలోమీటర్ల నల్లమల అడవి ఉంది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం కోణంలో అక్కడ ఉన్న చెంచులను ఇతర మైదాన ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అలాగే శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్‌ను ని ర్మించాలనే ప్రతిపాదన గతంలో నుంచి ఉండ గా.. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 54 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌కు రూ. 7,668 కోట్లతో ప్రతిపాదనలు పంపి.. కేంద్ర మంత్రులను కూడా కలిశారు. అది రెండు లైన్ల వరకే ఉండగా.. భవిష్యత్ అవసరాల దృ ష్ట్యా నాలుగు లైన్లకు పెంచాలనే ఆలోచన చేశారు. అటవీశాఖ అనుమతులు, టెక్నికల్ ఇబ్బందులు దృష్ట్యా ప్రస్తుతం ఉన్న రోడ్డు గుండానే ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉండాలని భావించగా.. ఆ పనులు ఎందుకు కార్యరూపం దాల్చ డం లేదో తెలియని పరిస్థితి. కేంద్ర పరిధిలోని అంశం కావడంతో ఫైలు ఎక్కడ ఆగిందో తెలియని పరిస్థితి. అలాగే బుల్లెట్ రైలు ప్రాజెక్టును కూడా నల్లమల గుండానే తీసుకువెళ్లాలని ప్రా థమికంగా అంచనా వేయగా.. అలైన్‌మెంట్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది. దాని పై స్పష్టత లేకపోవడం.. సర్వేకు వచ్చిన అధికారులు కూడా ప్రతిపాదనలను సిద్ధం చేయకపోవడం గందరగోళానికి దారితీస్తోంది.
పర్యాటక కేంద్రాలకు నెలవు
నల్లమల ప్రస్తుతం ఎన్నో పర్యాటక కేంద్రాలకు నెలవుగా ఉంది. ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం, సలేశ్వరం, పర్హాపూర్ వ్యూ పాయింట్, అక్కమహాదేవి గుహలు, ప్రతాపరుద్రుడి కోట, లొ ద్దిమల్లయ్య, భౌరాపూర్ ప్రాంతాలు ఎంతో ప్రసి ద్ధి చెందినవి.. ఇక్కడ సఫారీ టూర్ ప్రారంభించినా.. ప్రచారం ఆశించిన స్థాయిలో లేదు. పర్యాటక అభివృద్ధి చేస్తే అచ్చంపేట ప్రాంతం అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తూర్పుజాతి గోవులకు ప్రత్యేక అభివృద్ధి కేం ద్రాన్ని మంజూరు చేసినా.. కార్యరూపం దాల్చితే నల్లమలకే పరిమితమైన ఆ జాతి సంతతి పెరిగే అవకాశం ఉంది. నల్లమల ప్రాంతంలో విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వైశాల్యంపరంగా పెద్ద నియోజకవర్గమైనా, ఉన్నత విద్య అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, అనేక మూలికలకు కేంద్రమైన నల్లమల కేంద్రంగా ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ, రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని వినతులు ఉన్నాయి.
‘ఉమామహేశ్వరం’పైనే సాగు ఆశలు
అచ్చంపేట నియోజకవర్గంలో మెజారిటీ అటవీ ప్రాంతం ఉంటుంది. సాగు భూములకు వర్షం తప్ప వేరే ఆధారం లేదు. కల్వకుర్తికి అ నుసంధానంగా అచ్చంపేట నియోజకవర్గంలో ని బల్మూరు మండల సమీపంలో ఉన్న మైలా రం వద్ద 2.67 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఉమామహేశ్వర రిజర్వాయర్‌పైనే ప్రజలకు ఆశలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అచ్చంపేట, బల్మూరు, ఉప్పునుంతల మండలాల్లోని 57,600 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ. 1,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 1,980 ఎకరాలు ముం పునకు గురవుతుండగా.. 600 మంది నిర్వాసితులు ఉన్నారు. నష్టపరిహారం విషయంలో వీరు అసంతృప్తిగా ఉన్నారు. అలాగే ప్రాజెక్టు పనులు కూడా అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇక ఫేజ్-2లో భాగంగా చంద్రసాగర్ ప్రాజెక్టులోకి నీరు నింపి.. అక్కడ నుంచి దుర్వాస చెరువు వరకు నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నారు. దాంతో అమ్రాబాద్, పదర మండలాల్లో 30 నుంచి 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఈ సభలో ఫేజ్ -1, 2 పనులపై సీఎం తీపి కబురు అందిస్తారనే ఆశ ఉంది. పాలమూరు - రంగారెడ్డి నుంచి డిండికి నీరు తీసుకుపోవ డం, నక్కలగండి రిజర్వాయర్‌తో అచ్చంపేటకు నష్టం తప్పా లాభం లేదని పాలమూరుకు సంబంధించిన ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో స మీక్ష చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఏదుల నుంచే డిండికి నీటిని తరలించాలని, ఆ మేరకు పాలమూరు తగ్గే లోటును ప్రతిపాదనలు సిద్ధం చే సి.. 0.5 టీఎంసీల అదనపు తరలింపుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దాన్ని ఎలా అమలు చేస్తారు? అనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా సీఎం పర్యటనలో అనేక పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. దీర్ఘకాలికంగా పెండింగ్ ప్రతిపాదనలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అచ్చంపేట నియోజకవర్గంలో గురువారం ఆయన పర్యటించనున్నారు. అచ్చంపేటలో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి బుధవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మద్దిమడుగు ఆంజనేయస్వామి స్వామిని దర్శించుకుంటారని, అనంతరం సంతుసేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటుతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని వైజంక్షన్ వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బహిరంగ సభా ప్రాంగణం, హెలీప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, పాదయాత్ర మార్గం తదితర ప్రాంతాలను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, వనపర్తి ఎస్పీ సునీతా రెడ్డి, సీఎం భద్రతాదళం అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్, టీ-షాట్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.