గ్రీన్ చానల్ నిధులొచ్చేనా..!
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:37 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.
- ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల కోసం గతంలో సీఎం హామీ
- రెండు బడ్జెట్‌లలోనూ ఆశించినంతగా దక్కని కేటాయింపులు
- నిధుల్లేక నత్తనడకన ‘పాలమూరు- రంగారెడ్డి’ పనులు
- కల్వకుర్తి, భీమా, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలపై దృష్టి అవసరం
- ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చిన పాలమూరు ఎమ్మెల్యేలు
- నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
మహబూబ్‌నగర్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం శాఖల వారీగా పద్దులను కేటాయించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు గతంలో పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను కేటాయిస్తామని, సంవత్సరానికి రూ. 20వేల కోట్ల చొప్పున.. ఉమ్మడి జిల్లాకు అయిదేళ్లలో రూ. లక్ష కోట్లు కేటాయించే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రాజెక్టులను నెలకోసారి సమీక్షించి.. పూర్తిచేస్తామని చెప్పారు. ఇప్పటికి రెండుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. అందులో పాలమూరు ప్రాజెక్టులకు పెద్దగా నిధుల కేటాయింపు జరగలేదు. ఇప్పటికీ పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారలేదు. అనేక ఉన్నత విద్యాసంస్థలు వచ్చినప్పటికీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు నిధుల అవసరం ఉంది. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో ఒక డ్రైపోర్టును మంజూరు చేయాల్సి ఉంది. సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌ను కనెక్ట్ చేసేలా రూపొందించిన మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కాగా.. శరవేగంగా నడుస్తున్నాయి. అదే సమయంలో మిగతా ప్రాజెక్టుల పరిధిలో పరిహారం, ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ, నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు అధికారుల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను స్వీకరించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత మూడో బడ్జెట్ కావడంతో ఈ టర్మ్‌లో ప్రాజెక్టులను ఒక రూపుకు తీసుకురావాలంటే భారీ మొత్తంలో నిధులు ఇందులోనే కేటాయించాల్సిన అవసరం ఉంది. లేకపోతేపనులు విషయంలో గ్రహణం కొనసాగుతూనే ఉంటుంది.
గతేడాది రూ. 2,768.85 కోట్ల కేటాయింపులు
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది (2025-2026) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 2,768 కోట్లు కేటాయించింది. అంతకుమందు ఏడాది (2024-2025) రూ. రూ. 2,792.85 కోట్లు కేటాయించగా, 2025 కంటే స్వల్పంగా బడ్జెట్ తగ్గింది. ఆ నిధులు కూడా రివైజ్‌డ్ ఎస్టిమేషన్‌కు, నిర్వహణ ఖర్చులకే సరిపోయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డికి కీలకమైన పీఆర్‌ఎల్‌ఐకి గతేడాది రూ. 1,714 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది రూ. 1,285 కోట్ల కంటే ఇవి ఎక్కువే అయినప్పటికీ.. ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీరందలేదు. కేవలం రూ. 27వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుత వేస్తున్న అంచనాల ప్రకారం రూ. 80 వేల కోట్లు ఖర్చవుతుంది. ఆ మొత్తం ఖర్చు చేయాలంటే బడ్జెట్‌లోనే కాకుండా ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు అవసరం.. డీపీఆర్‌కు ఆమోదం లేకపోవడం వల్ల ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడం లేదు. రిజర్వాయర్ల పనులు 90 శాతం పూర్తికాగా.. పంప్‌హౌజ్‌లు, ఉదండాపూర్ పరిహారం వంటి ప్రహసనాలు చాలా ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో ప్రస్తావించినట్లుగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చేపడతారా? అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. కల్వకుర్తి కింద అదనపు రిజర్వాయర్లు, డిస్ర్టిబ్యూటరీల నిర్మాణం, తుమ్మిళ్ల కింద స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం, భీమా కింద కానాయపల్లి ముంపు గ్రామాన్ని ఖాళీ చేయించి.. పూర్తిస్థాయి నిర్మాణం చేయడం, నెట్టెంపాడు కింద ర్యాలంపాడు లీకేజీల మరమ్మతుకు నిధులు అవసరం ఉంది. ప్రతీ ఏటా కొద్దిమేర మాత్రమే బడ్జెట్ కేటాయింపులు దక్కుతున్నందున.. ఈ బడ్జెట్‌లో అధిక మొత్తంలో కేటాయింపులు చేయాల్సి ఉంది. కేవలం గట్టు, తుమ్మిళ్ల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల కోసమే దాదాపు రూ. 3వేల కోట్లు అవుతాయని అంచనాలున్నాయి. ఇది కాకుండా జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం నానాటికీ కోల్పోతున్నందున గూడెందొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు, ర్యాలంపాడును 10 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదనలు చేస్తున్నారు.
మౌలిక వసతులు అవసరమే..
ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరయ్యాయి. ఒక్కో స్కూల్ నిర్మాణ అంచనా రూ. 200 కోట్లు.. 14 నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణానికి రూ. 2,800 కోట్లు అవసరమవుతాయి. ఇందులో 40 శాతం బడ్జెట్ అయినా ఈసారి కేటాయిస్తే వాటి నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లలో చాలావాటికి సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల్లోకి మారాల్సిందేనని చెప్పినప్పటికీ కొన్నిచోట్ల వసతి లేక ఇబ్బందులు తప్పడం లేదు. పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు కోసం చాలామది ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది పర్యాటకరంగానికి రూ. 775 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయగా.. అందులో రూ. 242 కోట్లు నల్లమలలో పర్యాటకరంగ అభివృద్ధికి కేటాయించింది. ఇందులో భాగంగా కృష్ణానదిలో జెట్టీలు, లాంచి స్టేషన్లు, వాటర్ స్పోర్ట్స్, హౌస్‌బోట్లు, నదీ ఉత్సవాలను ప్రోత్సహించాలని నిర్ణయించినా, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. అమ్రాబాద్‌లో అటవీ అతిథి గృహాల అభివృద్ధి, సఫారీ సేవలు, ట్రెక్కింగ్ మార్గాలు, సోమశిల వద్ద బోటింగ్, క్యారవన్ క్యాంపింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని గత బడ్జెట్‌లో ప్రస్తావించినా.. ఆ దిశగా చొరవ తక్కువగా ఉంది. అత్యంత పెద్ద జాతీయ రహదారి కలిగిన ఎన్‌హెచ్-44పై అనేక పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంది. ఆ దిశగా ఈ బడ్జెట్‌లో కేటాయింపులను ప్రజలు ఆశిస్తున్నారు.