కల సాకారమయ్యేనా?
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:30 PM
గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు శాస్త్రీయంగా ఏర్పడలేదన్న భావనతో తాజాగా కొత్త మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం పునర్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
- కొల్లూర్ మండల అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే చర్చ
నవాబ్‌పేట, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు శాస్త్రీయంగా ఏర్పడలేదన్న భావనతో తాజాగా కొత్త మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం పునర్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నవాబ్‌పేట మండలంలోని కొల్లూర్ గ్రామం ఈ సారైన మండల కేంద్రంగా ఏర్పాటు అవుతోందా? లేదా? అని గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కొల్లూర్‌ను మండలం చేయాలని అసెంబ్లీలో చర్చించడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
మండల ఏర్పాటుకు కావల్సిన అర్హతలు..
కొల్లూర్ గ్రామం ప్రస్తుత నవాబ్‌పేట మండల కేంద్రానికి 12 కిలో మీటర్ల దూరంతో పాటు షాద్‌నగర్, కొందుర్గు మండలాలకు సైతం దూరంగా ఉండటంతో ఈ ప్రాంత విద్యార్థులు ఇంటర్ చదవాలంటే నవాబ్‌పేట, కొందుర్గు, షాద్‌నగర్‌కు నిత్యం ప్రయాణం కొనసాగిస్తున్నారు. అలాగే బస్సులు సైతం అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెట్టింది పేరు. మహబూబ్‌నగర్ - ముంబాయి రహదారి ఉండటంతో భవిష్యత్‌లో ఈ రహదారి జాతీయ రహదారిగా మారే అవకాశం ఉంది. పోమాల్, కొల్లూర్, కేశవరావ్‌పల్లి, కొత్తకుంట తండా, తిమయ్యపల్లి, చౌడూర్, జంగమయ్యపల్లి, లింగంపల్లి, కాకర్జాల, దేపల్లితో పాటు రంగారెడ్డి జిల్లాలోని అయిరాల, వెంకిర్యాల, గుంజల్‌పాడ్, జాకారం గ్రామాలను కలుపుకుని నూతన మండలం ఏర్పాటు చేయవచ్చు.