బుజ్జగింపులు ఫలించేనా?
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:26 PM
పురపోరు కీలక దశకు చేరింది. నామినేషన్‌ల ప్రక్రియ ఇప్పటికే ముగియగా, పార్టీలకు చెందిన అభ్యర్థులెవరో దాదాపుగా తేలిపోయింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ(విత్‌డ్రా)కు చివరిరోజు కావడంతో
మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల
కొన్ని చోట్ల పెద్ద ఎత్తున బేరసారాలు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పురపోరు కీలక దశకు చేరింది. నామినేషన్‌ల ప్రక్రియ ఇప్పటికే ముగియగా, పార్టీలకు చెందిన అభ్యర్థులెవరో దాదాపుగా తేలిపోయింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ(విత్‌డ్రా)కు చివరిరోజు కావడంతో పోటీలో ఉండేదెవరు?.. తప్పుకునేది ఎవరు?.. పార్టీ గుర్తులపై పోటీచేసేది ఎవరు?.. రెబల్స్‌గా బరిలో దిగేదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో వారిని బుజ్జగించి తప్పించడం పార్టీల నాయకులకు ఇబ్బందిగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది తలపోటుగా మారింది. పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్‌లకు గాను ఆ పార్టీ నుంచి 216 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దేవరకద్ర మునిసిపాలిటీ పరిఽధిలో 12 వార్డులకు 16 మంది, భూత్పూర్‌లో 10 వార్డులకు 17 మంది అభ్యర్థులు కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. మునిసిపాలిటీలలో పెద్ద సమస్య లేకపోయినా పాలమూరు కార్పొరేషన్‌లో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. 60 డివిజన్లకు మంది పోను మరో 156 మందిని పోటీ నుంచి తప్పించాల్సి ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన వాళ్లు కొందరై ౖతే, ఇండిపెండెంట్‌లుగా చా లా మంది ఉన్నారు. పార్టీ నుంచి పోటీ చేసి, బీఫామ్ అందని వారు.. తమ నామి నేషన్‌ను ఉపసంహరించు కోకపోతే ఇండిపెండెంట్లుగా మారే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు రెబెల్స్‌గా మారకుండా తప్పించేందుకు బుజ్జగింపులు చేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు నాయకులకు సమస్యగా మారుతోంది. ఇక బీఆర్‌ఎస్ నుంచి కార్పొరేషన్‌లో 99 మంది నామినేషన్ వేయగా, బీజేపీ నుంచి 78 మంది ఉన్నారు. బీఆర్‌ఎస్ కూడా 39 మందిని తప్పించాల్సి ఉంటుంది. బీఆర్‌ఎస్ నుంచి దేవరకద్రలో 19 మంది, భూత్పూర్‌లో 17 మంది పోటీలో ఉన్నారు.
బుజ్జగింపులకు తలొగ్గుతారా?
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యం చేయడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. సర్వేల పేరుతో నాన్చివేత ధోరణి అవలంభించడంతో పాటు బీఫామ్‌లు కేటాయించకుండా చివరి వరకు ఆపడం సమస్యగా మారింది. ముందు పార్టీ తరఫున నామినేషన్ వేయాలని చెప్పడంతో ఒక్కో డివిజన్ నుంచి ఇద్దరు, ముగ్గురు నామినేషన్ వేశారు. చాలామంది పార్టీ తరఫున, ఇండిపెండెంట్లుగా కూడా నామినేషన్ వేశారు. ఇప్పుడు ఒకరికి బీఫామ్ ఇచ్చి పోటీలో ఉన్న ఇద్దరు, ముగ్గురిని తప్పించాలంటే సవాల్‌గా మారనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేటి మఽఽధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండటంతో ఆలోపు ఎంతమందిని బుజ్జగించి పోటీనుంచి తప్పిస్తారో చూడాలి. 3 గంటల తరువాత బీఫామ్‌లు ఇచ్చిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు కేటాయిస్తారు. ఇండిపెండెంట్లకు స్వతంత్ర గుర్తులు కేటాయించనున్నారు.
పెద్దఎత్తున బేరసారాలు
పోటీ ఎక్కువగా ఉన్నచోట వారిని తప్పించేందుకు పెద్ద ఎత్తున బేరసారాలు సాగిస్తున్నారు. టికెట్‌రాని సొంత పార్టీ అభ్యర్థులతోపాటు పక్క పార్టీలకు చెందిన అభ్యర్థులను కూడా విత్‌డ్రా చేసుకోవాలని బేరసారాలు చేస్తున్నారు. నగరంలో ఓ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు అతనికి పోటీగా ఉన్న ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థిని తప్పుకోవాలని రూ.లక్షల్లో బేరసారాలు చేశారన్న ప్రచారం సాగుతోంది. మరోచోట ఒకే పార్టీలో ఇద్దరు పోటీలో ఉండగా టికెట్ వచ్చిన వ్యక్తి.. పోటీలో ఉన్న మరో అభ్యర్థిని తప్పుకోవాలని కోరినట్లు తెలిసింది. అందుకు అతను తాను ఇప్పటివరకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టానని, వాటికి రెండింతలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. టికెట్ రాని మరికొందరు ఇండిపెండెంట్లు తమచేత విత్‌డ్రా చేయిస్తారని ఫోన్ స్విచ్‌ఆ్‌ఫ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.