ఏటీఎం ఎత్తుకెళ్లిందెవరు?
ABN , Publish Date - May 29 , 2026 | 11:15 PM
మహబూబ్‌నగర్ పట్టణ నడిబొడ్డున జరిగిన ఏటీఎం చోరీ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు.
- సంఘటన జరిగి నాలుగు రోజులు
- నాలుగు బృందాలతో తనిఖీలు
- ఇప్పటివరకు లభించని క్లూ
- పోలీసులకు సవాలుగా మారిన కేసు
మహబూబ్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ పట్టణ నడిబొడ్డున జరిగిన ఏటీఎం చోరీ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. దొంగతనం జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు దొంగలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కాదు కదా.. కనీసం క్లూ కూడా లభించ లేదు.. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను ఈనెల 26 అర్ధరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అందులోని రూ.2,37,500 నగదును తీసుకుని యంత్రాన్ని బోయపల్లి శివారులో పడేసి వెళ్లిపోయారు. ఈ కేసును చేధించేందుకు నాలుగు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. టూటౌన్‌కు చెందిన రెండు బృందాలు, సీసీఎస్, జడ్చర్ల క్రైమ్ పార్టీ బలగాలతో మరో రెండు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదని సమాచారం.
బోయపల్లి శివారు నుంచి ఎటు వెళ్లారు?
తెలంగాణ చౌరస్తాలోని ఏటీఎంను దొంగలు బొలేరో వాహనంలో వేసుకుని బోయపల్లి గేట్ మీదుగా వెళ్లారు. అందులోని నగదును తీసేసుకొని బోయపల్లి శివారులో, టంకరకు వెళ్ళే దారిలో ఏటీఎంను వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు అదే రోజు దానిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి బొలేరో వాహనం ఏ మార్గంలో వెళ్ళిందో పోలీసు బృందాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ స్పాట్ నుంచి హన్వాడ, నవాబ్‌పేట, కోయిలకొండ ఇలా అన్ని మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నా, ఎక్కడా వాహనం ఆనవాళ్లు కనిపించకపోవడం దర్యాప్తుకు సవాల్‌గా మారింది. దొంగలు పకడ్బందీగా వ్యవహరించి, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండే మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రధాన రహదారిపై కాకుండా గల్లీ రోడ్లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముందుగానే పక్కాగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకొని చోరీకి పాల్పడినట్లు అర్థమవుతోంది. ఏటీఎంలో ఆదివారం డబ్బులు అయిపోతే, సోమవారం అధికమొత్తం నగదు ఉంచుతారని దొంగలు అంచనా వేశారని, అందుకే పకడ్బందీ పథకాన్ని రూపొందించుకొని సోమవారం రాత్రి ఏటీఎంను ఎత్తుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. వారి అంచనా ప్రకారం బ్యాంక్ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఏటీఎంలో డబ్బులు పెట్టారు. కానీ రూ.2 లక్షల నగదును మాత్రమే ఉంచడంతో దొంగల చేతికి తక్కువ మొత్తమే లభించినట్లయింది.