అభ్యర్థులెవరు?
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:16 PM
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి వచ్చే సంవత్సరంలో జరిగే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్య వహరిస్తున్నాయి.
- బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై సందిగ్ధత
- కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికే పర్యటన
- స్వతంత్రంగానైనా పోటీకి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి సన్నాహాలు
- బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కాసాని వీరేశ్..? కొనసాగుతున్న సస్పెన్స్
- బీజేపీ నుంచి రాంచందర్‌రావు వైపే మొగ్గుచూపుతున్న పార్టీ
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి వచ్చే సంవత్సరంలో జరిగే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్య వహరిస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్నడూ లేని విధం గా వేగంగా కదులుతుంటే అభ్యర్థుల ఖరారు, క్యాంపెయినింగ్‌లో వేగం చూపించే బీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం ఈసారి తాత్సారం చేస్తున్నా యి. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుద ల కాకపోయినప్పటికీ అభ్యర్థులు పట్టభద్రులను కలువడానికి చాలా సమయం పడుతుంది. సా ధారణంగా జరిగే ఎన్నికల ప్రచారంలా ఈ ప్రచారం ఉండదు. మరి ఈ పార్టీలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాయి, చూ చాయగా అభ్యర్థులను అనుకుంటున్నప్పటికీ వారే ఫైనల్ అనే సంకేతాలు క్షేత్రస్థాయికి పం పుతున్నప్పటికీ అధికారిక ప్రకటన చే యడానికి ఎందుకు వెనకడుగు వే స్తున్నాయో అర్థం కావడం లేదని ఆయా పార్టీల కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎమ్మెల్సీ స్థానాల కోసం భారీగా పోటీ ఉండేది. సంప్రదాయం ప్రకారం నామినేషన్ల చివరి వరకు కూడా అభ్యర్థులు తేలడం కష్టంగా ఉండేది. కానీ, టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఏకాభిప్రాయంతో ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేశారు. దీనివల్ల ఆశావహులు పెరుగకుండా అడ్డుకోవడం, ప్రకటించిన అభ్యర్థులు జనాల్లో వెళ్లడం సాధ్యమవుతుందని పార్టీ అభిప్రాయంగా ఉన్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్‌రెడ్డి పేరు ఖరారైన విషయం తెలిసిందే.. దీంతో పాటు కల్వకుంట్ల కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నియోజకవర్గానికి సీనియర్ జర్నలిస్టు అకాష్ కొల్లూరిని ప్రకటించగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. సామ రా మ్మోహన్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలను కలవడం, పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులతో స మావేశం కావడం వంటివి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ క్యాంపెయిన్ ఇంకా జోరందుకోలేదు. కేవలం పరిచయాలే కొనసాగుతుండగా పోటీ ఆసక్తికరంగా మారనుంది.
తర్జనభర్జన...
అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఏడాది ముందు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ఈ ఎన్నికలపై ఎక్కు వ శ్రద్ధ చూపడం సర్వసాధారణం. దాదాపు తెలంగాణలోని ఆరు ఉమ్మడి జిల్లాలో అం దులోనూ హైదరాబాద్ మహానగరం ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎన్నిక కావడంతో పట్టణ ఓటరు ఎటు మొగ్గుచూపుతారు, చదువుకున్న వారి మద్దతు ఎవరికి అనే విషయంలో కొంత స్పష్టత వస్తుంది. అందుకే రొటీన్‌కు భిన్నంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలపడినప్పటికీ అనేక విషయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ప్ర భుత్వాన్ని కార్నర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నే ఆ పార్టీకి అభ్యర్థుల పోటీ కూడా ఉన్నది. కానీ, కాంగ్రెస్ ఇప్పటికే రెడ్డి సామాజిక వ ర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ కూడా రెడ్డి లేదా బ్రహ్మణ సామాజిక వర్గాలకు టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. తాము బీసీ నినాదంతో వెళ్తే తమకు ఎన్నికల్లో మేలు జరగుతుందని భావించిన పార్టీ సూత్రప్రాయంగా కాసాని వీరేశ్ ముదిరాజ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు అధికార ప్రకటన మాత్రం వెలువడలేదు. అదే సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ కూడా సామాజిక తెలంగాణలో భాగంగా బీసీ వర్గానికి చెందిన అకాష్ కొల్లూరిని ఖరారు చేసింది. పార్టీలపరంగా దాదాపు రెండు బీసీ ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది. ఇక బీజేపీ నుంచి మొదట్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉంటారనే చర్చ జరిగింది. ఆయన కూడా చురుకుగా ఓటర్ నమోదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే గతంలో ఈ సీటులో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎమ్మెల్సీగా గెలిచారు. తాను పోటీచేస్తే పార్టీ గెలుపు సునాయాసం అవుతుందని పార్టీ భావన. అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీటులో బీజేపీ ఓడిపోయిన తర్వాత పార్టీలో కీలకంగా ఉన్నవారు పోటీచేసి ఓడిపోతే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలా అయ్యే స్థితిలో ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని ఎమ్మెల్సీగా పోటీ చేస్తారనే చర్చ కూడా నడుస్తోంది. మరి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
గాల్‌రెడ్డి ప్రభావమూ కీలకమే...
వాస్తవానికి టీచర్ ఎమ్మెల్సీగా పలుమార్లు పోటీచేసిన టీపీఆర్‌టీయూ వ్యవస్థపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం ఆశపడ్డారు. పార్టీలో సీనియర్‌గా ఉండి పలుమార్లు అభ్యర్థిత్వం ఆశపడి భంగపడిన ఆయనకు అవకాశం దక్కుతుందని చాలామంది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశించాయి. కానీ, అనూహ్యంగా సామ రామ్మోహన్‌రెడ్డి పేరును పార్టీ ముందస్తుగానే ఖరారు చేసింది. ఈ సమయంలో ఆయన ఎటుపోతారనే ప్రశ్న ఉత్పన్నమైంది. గతంలో కూడా పార్టీ నిరాకరించినా తాను స్వతంత్రంగానైనా పోటీచేశారు. ఈసారి కూడా అదే విధానాన్ని నమ్ముకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారైన తర్వాత పలువురు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డిని పోటీ చేయిస్తే బాగుంటుందని, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాయబారం కూడా నడిపినట్లు సమాచారం. అయితే పార్టీ బీసీలకు టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనకు ఫిక్స్ అయినట్లు చర్చ జరుగుతోంది. కానీ, అధికారికంగా ప్రకటించే వరకు ఎవరనేది తెలియదు. ఒకవేళ మాజీ ఎమ్మెల్యేల మంత్రాంగం ఫలించి.. బీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థిగా ఖరారైనా ఒకవేళ కాకపోయినా ఎన్నికల్లో పోటీచేయడం ఖాయమనే భావన గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్రాడ్యుయేట్లలో అతిపెద్ద ఓటు బ్యాంకు అయిన టీచర్లలో ఆయనకు మంచి పట్టుంది. ఈ జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌లో కూడా ఆయన సుపరిచితంగా ఉండటం, పలుమార్లు పోటీచేసిన అనుభవం ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. మరీ బీఆర్‌ఎస్ వారు ఆయన్ను లాక్కొని టిక్కెట్ ఇస్తారా? లేదా స్వతంత్రంగా పోటీచేస్తారా? అనేది టిక్కెట్ ప్రకటన తర్వాత తెలుస్తుంది.