ఎక్కడి బస్తాలు అక్కడే
ABN , Publish Date - May 11 , 2026 | 11:11 PM
కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న సంచులు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. కాంటా పూర్తయిన మొక్క జొన్న బస్తాలు లక్షల్లో నిల్వ ఉన్నాయి.
- కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న మొక్కజొన్న
- గద్వాల జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా బస్తాల నిల్వ
- హమాలీలు, లారీల కొరతతో తలెత్తిన సమస్య
- అకాల వర్షాలతో రైతుల ఆందోళన
అలంపూరుచౌరస్తా, మే 11 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న సంచులు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. కాంటా పూర్తయిన మొక్క జొన్న బస్తాలు లక్షల్లో నిల్వ ఉన్నాయి. హమాలీల కొరతతో లోడింగ్, అన్‌లోడింగ్‌లలో జాప్యం కావడం సమస్యగా మారింది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నెల రోజుల క్రితం అలంపూరు, అలంపూరుచౌరస్తా, క్యాతూరు, క్యాతూరు, వడ్డేపల్లి, రాజోలి, అయిజ, గద్వాల పట్టణాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చారు. ఆయా కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్నను కొత్తకోట, పెబ్బేరు, బోరవెళ్లి, ఉండ వల్లి, అయిజ ప్రాంతాల్లోని గోదాములకు తరలిస్తున్నారు. కానీ అవసరమైనన్ని లారీలు కూడా లేకపోవడంతో బస్తాల తరలింపులో జాప్యం జరుగుతోంది. కొనుగోలు పాయింట్ నుంచి గోదాముకు వెళ్లిన లారీ మూడు రోజులైనా తిరిగి రావడంలేదు. దీంతో ఆయా కేంద్రాల్లో కాంటా పూర్తయిన బస్తాలు లక్షలాదిగా పేరుకుపోయాయి. రైతులు వారాల తరబడి ఇల్లూ వాకిలి వదిలి అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రస్తుతం అయిజలో 35 వేలు, క్యాతూరులో 55 వేలు, అలంపూరులో 35 వేలు, అలంపూరు చౌరస్తా లో 70 వేలు, శాంతినగర్‌లో 1,03,489, రాజోలిలో 16 వేలు, అయిజలో 45 వేలు, గద్వాలలో 83,400 ఇలా దాదాపు నాలుగు లక్షల బస్తాలకు పైగా నిల్వ ఉన్నాయి. దీంతో బస్తాల నిల్వకు స్థలం లేక కొనుగోళ్లు నిలిపివేయాల్సి వస్తోందని సిబ్బంది చెప్తున్నారు.
అధికంగా కూలి డిమాండ్
ఆన్‌లోడ్ పాయింట్లలో హమాలీలు తక్కువగా ఉండటంతో ఉన్నవారు అధికంగా డిమాండ్ చేస్తున్నా రని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా లారీ నుంచి 50 కిలోల బస్తాను దించేందుకు రూ.5 చెల్లించేవారు. ప్రస్తుతం రూ.6.50 తీసుకుంటున్నారు. కానీ అయిజ గోదాము వద్ద హమాలీలు సంచికి రూ.12 డిమాండ్ చేస్తున్నారు. దీంతో రైతులపై అద నపు భారం పడుతోంది. దీనికి తోడు తరుచూ అకాల వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్నను కాపాడుకు నేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన గాలివానకు అలంపూరు చౌర స్తా, శాంతినగర్, అలంపూరు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న కొంతమేర తడిసి పోయింది. అలం పూ రు చౌరస్తాలోని కొనుగోలు వద్ద రైతులు బస్తాలపై నిలిచిన వర్షపు నీటిని తోడేస్తూ కనిపించారు.
పడిగాపులు కాస్తున్నాం
సాగు సమయం లో పొలం వద్ద కూడా ఇన్ని రోజులు ఉండలేదు. నేను 25 రోజుల క్రితం మొక్క జొన్న తీసుకొని కేంద్రా నికి వచ్చాను కాంటా పూర్తయినా, బస్తాలను లారీల్లోకి ఎత్తేదాక సంచుల వద్ద కావలి ఉంటున్నాం. ఆదివారం కురిసిన వర్షానికి మొక్కజొన్న బస్తాలపై కప్పిన టార్పాలిన్ల మీద వర్షం నీరు నిలిచింది..
- బజారన్న, రైతు, కంచుపాడు
రైతులకు ఇబ్బంది కలగనివ్వం
కొన్ని గోదాముల వద్ద హమాలీల కొరత ఉన్నమాట వాస్తవమే. కూలీ గిట్టుబాటు కావడంలేదని హమాలీ లు చెప్తున్నారు. వారితో చర్చలు జరిపి కొనుగోలు కేంద్రాల్లోని బస్తాలన్నింటినీ త్వరలో తరలిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రైతులు సంయమనం పాటిస్తే కొనుగోలు పక్రియ సజా వుగా సాగుతుంది.
- చంద్రమౌళి, మార్క్‌ఫెడ్ డీఎం