ఎక్కడ పోయినా.. ఇక్కడే కేసు....!
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:59 PM
వనపర్తి జిల్లాలో ప్రస్తుతం మిస్సింగ్ ఆర్‌సీ సర్టిఫికెట్ల దందా పోలీసు శాఖను కుదిపేస్తోంది.
- ఆర్‌సీలు పోగొట్టుకున్నవారికి కేరాఫ్ అడ్రస్‌గా వనపర్తి
- డిజిటల్ డాంగిల్‌తో ఎస్‌ఐలకు తెలియకుండా సర్టిఫికెట్లు
- హైదరాబాద్ ఆర్‌టీఐ ఏజెంట్ల నేతృత్వంలో రైటర్లకు రాబడి
- మార్చి నుంచి రెండు స్టేషన్లలో 1,600 ఆర్‌సీ సంబంధిత కేసులు
- ఇప్పటికే ఇద్దరు రైటర్ల సస్పెన్షన్ అన్ని స్టేషన్లలో విచారణ షురూ!
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
వనపర్తి జిల్లాలో ప్రస్తుతం మిస్సింగ్ ఆర్‌సీ సర్టిఫికెట్ల దందా పోలీసు శాఖను కుదిపేస్తోంది. డిజిటల్ డాంగిల్‌ను దుర్వినియోగం చేస్తూ, అవి నీతికి పాల్పడిన ఇద్దరు రైటర్లను ఇప్పటికే ఎస్సీ సునీతరెడ్డి సస్పెండ్ చేయగా.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విచారణ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరో రెండు పోలీసు స్టేషన్లలో మిస్సింగ్ సర్టిఫికెట్ల దందా నడిచినట్లు సమాచారం. సాధారణంగా ప్రజలకు నిత్య జీవితంలో అనేక ధ్రువపత్రాలతో అవసరం ఉంటుంది. విద్య, వైద్యం, డ్రైవింగ్, బ్యాంకు, ఏటీఎం, క్రెడిట్ కార్డు ల్లాంటి ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్తుంటారు. ఒకవేళ అవి పోగొట్టుకుంటే తిరిగి సాధించడం కష్టసాధ్యం. అలాగని నేరుగా ధ్రువపత్రాలు పోయాయంటే ఎవరూ కొత్త సర్టిఫికెట్లు టపీమని ఇచ్చేయరు.. దానికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, నిర్దేశిత ఫార్మాట్లలో అఫిడవిట్లు సమ ర్పించడం వంటి తంతు ఉంటుంది. వాటిని న్యాయమని నమ్మితే పోలీసులు మిస్సింగ్ సర్టిఫికెట్లు ఇస్తారు. గతంలో ఈ ప్రక్రియ మాన్యువల్ పద్ధతిలో ఉండేది. ఎస్‌ఐ నేరుగా సంతకం చేసి.. సర్టిఫికెట్ ఇచ్చే వారు. కానీ టెక్నాలజీ పెరగడం, ఇతర బాధ్యతలు ఎస్‌ఐలపై పడి భారం పెరగడంతో డిజిటల్ సేవల మెరుగుదల కోసం తెచ్చిన మీసేవలో సంబంధిత ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ డాంగిల్ ద్వారా ఎస్‌ఐ సంతకంతో టెక్నికల్ వింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇంతవరకు అంతా సాఫీగానే ఉంది. కానీ వనపర్తిలో గత మార్చి నుంచి మిస్సింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్‌కు సంబంధించి వేల కేసులు నమోదయ్యాయి. వీటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎస్పీ ఆరా తీయగా.. తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే వనపర్తి పట్టణ రైటర్ భాస్కర్, పెద్దమందడి రైటర్ వెంకటేశ్‌లను సస్సెండ్ చేశారు. ఇంకా కొన్ని స్టేషన్ల పరిధిలో విచారణ జరుగుతోంది.
వాహన ఆర్‌సీలే ఎక్కువ..
ధ్రువపత్రాలు పోవడం సర్వసాధారణమే.. పోయిన వాటికి సంబంధించిన కేసులు నమోదు కావడం సాధారణమే.. అయితే వనపర్తి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఎక్కువశాతం కేసులు వాహనాల ఆర్‌సీ కార్డులకు సంబంధించినవే కావడం గమనార్హం. ఎస్పీకి అనుమానం కూడా ఈ కోణంలోనే వచ్చింది. డాంగిల్‌ను ఉపయోగించి.. ఎస్‌ఐ డిజిటల్ సిగ్నేచర్ చేయడం.. వాటిని వెరిఫై చేయడం వంటి పనులు స్టేషన్లలో రైటర్లే చేస్తున్నారు. దీంతో మొదట వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆరా తీయగా.. గత మార్చి నుంచి ఇప్పటివరకు కేవలం 1,360 వరకు మిస్సింగ్ ఆఫ్ ఆర్‌సీ సర్టిఫికెట్లు అప్రూవ్ అయినట్లు తేలింది. పెద్దమం దడి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 300కు పైగా ఆర్‌సీ మిస్సింగ్స్ అప్రూవల్ అయ్యాయి. జిల్లాలోని మరో పోలీస్ స్టేషన్ పరిధిలో 1,100 వర కు మిస్సింగ్ ఆఫ్ ఆర్‌సీలు జారీ అయినట్లు సమాచారం. ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా ఆ స్టేషన్‌పైనే విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరో ఒకరిద్దరు రైటర్లు సస్పెండ్ అయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ నడుస్తోంది. ఇవి కేవలం ఆర్‌సీలకు సంబంధించినవే కాగా.. మిగతా మిస్సింగ్ సర్టిఫికెట్ల కేసులు కూడా భారీగానే నమోదవుతున్నట్లు తె లుస్తోంది. ఎస్‌ఐలకు తెలియకుండా ఈ దందా నడుస్తుండటం గమనార్హం. ఒక్క వనపర్తి పరిధిలోనే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.
కేసునే ఆదాయ వనరుగా..
వనపర్తి జిల్లాకు చెందిన ఆర్‌టీఐ ఏజెంట్.. ఆర్‌సీ పోగట్టుకున్న వ్యక్తికి కొత్త కార్డు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడు.. దానిపై బాధితుడు పోలీసులను సంప్రదించగా.. కేసు నమోదైంది. ఆ కే సునే ఆదాయ వనరుగా మార్చుకోవాలని భావించిన సదరు ఏజెంట్.. హైదరాబాద్‌లో ఆర్‌సీలు పోగట్టుకున్నవారికి కొత్తకార్డులు ఇప్పించే దందా మొదలుపెట్టాడు.. వనపర్తిలో పని చేసినప్పుడు పరిచయమున్న రైటర్ల ద్వారా దందా నడిపించడం ప్రారంభించాడు. ఒక్కో మిస్సింగ్ ఆఫ్ ఆర్‌సీ సర్టిఫికెట్ అప్రూవల్‌కు రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు రైట ర్‌కు ముట్టజెప్సేవాడు.. కార్డు కావాల్సిన వారికి అర్జంట్ అయితే అంత కంటే ఎక్కువే అందేది. అలా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని ఆర్‌టీఐ ఏజెంట్లకు ఇలాంటి కేసులు వస్తే సర్టిఫికెట్ కోసం వనపర్తిలోనే కేసులు నమోదు చేస్తున్నారు. డిజిటల్ డాంగిల్ వ్యవస్థ కావడంతో రైటర్లు ఎస్‌ఐలకు తెలియకుండా తతంగం నడిపించేశారు. ఒక్క వనపర్తి పట్టణ పో లీస్ స్టేషన్ పరిధిలోనే 1,360 కేసులు కాగా.. అందులో మెజారిటీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినవి కావడం విశేషం. ఇలా వే రే ప్రాంతాల కార్డులు ఇక్కడ మిస్సింగ్ అయినట్లు చూపించి కొత్త కార్డులు ఇప్పించే దందా నడుస్తోంది.
విచారణ జరుపుతున్నాం
డిజిటల్ డాంగిల్ ఉప యోగించి అక్రమాలకు పాల్పడిన ఇద్దరు రైటర్లను ఇప్పటికే సస్పెండ్ చే శాం. మరికొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా విచారణ నడుస్తోంది. ఒకేసారి రైట ర్లందరిపై విచారణ చేపట్టడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో వన్ బై వన్‌గా చర్యలు తీసుకుంటాం. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ అక్రమాలను సహించేది లేదు.
- సునీతారెడ్డి, ఎస్పీ, వనపర్తి