మూడేళ్లైనా హామీల అమలేదీ?
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:01 PM
అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.
- ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్‌రెడ్డి
- బీఆర్‌ఎస్ నాయకుల ఎద్దేవా
మహబూబ్‌నగర్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్ట్‌ను ఎండబెట్టారని, పనులు చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరువస్తుందోనని అత్తమీద కోసం దుత్తమీద చూపినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో కారణంగా కరువు వచ్చిందని, పంటలు వేసుకోవద్దని చెప్పడం దురదృష్ఠకరమన్నారు. ఆంధ్రాకు ఎల్‌నినో ప్రభావం లేదు. కానీ తెలంగాణకే ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి కేవలం ఉచిత బస్సుతో చేతులు దులుపుకున్నారని, మూడేళ్లైనా హామీలు అమలు చేయకుండా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తున్నారని విమర్శించారు. కట్టా రవికిషన్‌రెడ్డి మాట్లాడుతూ పొద్దున లేస్తే శ్రీనివాస్‌గౌడ్ కేసులు పెట్టించిండు.. భూములు కబ్జా చేసిండని ఆరోపణలు చేస్తారన్నారు. మరి ఎక్కడ భూములు కబ్జా చేశారు? ఎన్ని భూములను స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించారు. కోర్టు దగ్గరకు పోయి అక్రమ కేసులు పెట్టారని ఫొటోలు దిగి వాట్సాప్‌లో పెట్టడానికి సిగ్గుండాలన్నారు. అక్రమ కేసులు శ్రీనివాస్‌గౌడ్ పెడతాడా? పోలీస్ స్టేషన్‌ల్లో నమోదవుతున్న కేసులన్నీ అక్రమ కేసులేనా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు కోడ్గల్ యాదయ్య, శివరాజు, ఆంజనేయులు, తాటి గణేష్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.