నిర్వహణ నిధులేవి..?
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:27 PM
గత ప్రభుత్వం రైతుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతువేదిక భవనాలు నిర్వహణ నిధులు రాక శిథిలదశకు చేరుకుంటున్నాయి.
- రైతు వేదికల పరిస్థితి
- ఒకే ఏడాది మంజూరైన నిధులు
- 2023 నుంచి పెండింగ్‌లో బిల్లులు
- దెబ్బతింటున్న ఫ్లోర్.. కుంగుతున్న పునాదులు
- పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు
అలంపూరుచౌరస్తా, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం రైతుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రైతువేదిక భవనాలు నిర్వహణ నిధులు రాక శిథిలదశకు చేరుకుంటున్నాయి. భవనాల్లోని బండలు, కొన్నిచోట్ల పునాదులు, పైకప్పు రేకులు దెబ్బతింటున్నాయి. దీంతో అప్పుడప్పుడు జరిగే రైతుసమావేశాలకు, మంత్రుల వీడియో కాన్ఫరేన్స్‌లు జరుగుతున్నా రైతుల హాజరు అంతంతమాత్రమేనని తెలుస్తోంది. మిగతా రోజుల్లో తాళాలు వేస్తుండటంతో, రాత్రుళ్లు వేదిక ఆవరణలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. వెరసి నిర్వహణ భారం ఏఈవోలపైనే పడుతుంది. రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో తమ జేబులు ఖాళీ అవుతున్నాయని ఏఈవోలు వాపోతున్నారు.
ఒకే ఏడాది మంజూరైన నిధులు
2020లో అప్పటి ప్రభుత్వం రెండు లేదా మూడు గ్రామాలను కలిపి క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించింది. ఇందుకోసం వ్యవసాయశాఖ నుంచి రూ. 12లక్షలు, ఉపాధిహామి పథకం నుంచి రూ. 10లక్షలు ఇలా ఒక్కొక్క భవనానికి సుమారు రూ. 22లక్షలు వెచ్చించి నిర్మించి అదే ఏడాదిలో అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు. రైతు సమావేశాలు నిర్వహించేందుకు అన్ని సాంకేతిక హంగులతో పాటు టాయిలెట్ గదులు నిర్మించారు. వీటి నిర్వహణ నిమిత్తం ప్రతినెల రూ.9వేలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో పారిశుధ్య పనులు, స్వీపరు కోసం రూ.3వేలు, విద్యుత్‌బకాయిల కోసం రూ.వెయ్యి, తాగునీటి అవసరాల కోసం రూ.500, స్టేషనరీ కోసం రూ.1000, సభలు/సమావేశాల అవసరాల కోసం రూ.2500, చిన్నపాటి మరమ్మతులు, ఇతర అవసరాల కోసం మరో వెయ్యి చొప్పున ఖర్చు చేయాలన్నది ఉద్దేశం. ప్రారంభమైన చాలా రోజులకు 2022 చివరలో కొన్ని నెలలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేశారు. ఆ తర్వాత 2023 నుంచి నిర్వహణ నిధుల విడుదల అటకెక్కడంతో చాలాచోట్ల పగుళ్లు వచ్చిన గోడలకు, కుంగుతున్న పునాదిగోడలకు, దెబ్బతింటున్న టాయిలెట్ గదులకు, లేచిపోతున్న పైకప్పు రేకులకు మరమ్మతులు చేపట్టడంలేదు. సరికదా కనీసం భవనాన్ని శుభ్రపరిచేవారులేక శిథిల భవనాలను తలపిస్తున్నాయి. కలుగొట్ల, బోరవెల్లి, లింగనవాయి, బుక్కాపురం, వేముల, రామాపురం, తూర్పుగార్లపాడు, పచ్చర్ల తదితర భవనాలు మరమ్మతులకు గురయ్యాయి. చాలావాటిల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలున్నాయి.
ఏఈవోల జేబులకు చిల్లు..
రైతువేదికల్లో చిన్న చిన్న అవసరాల కోసం ఏఈవోలే ఖర్చు పెడుతున్నారు. నెలకు వచ్చే విద్యుత్ బకాయిలు, తాగునీటి ఖర్చులు, స్టేషనరీ ఖర్చులు ఇలా జేబులో నుంచే ఖర్చు పెడుతున్నామని, బిల్లులు పెట్టడమే కానీ తిరిగి రావడంలేదని పలువురు ఏఈవోలు వాపోయారు. చాలా భవనాలకు వేలకు వేలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామంలో ఉన్న రైతువేదికకు చెందిన విద్యుత్ బకాయి రూ.15,160గా ఉంది. దాదాపు అన్ని భవనాల బకాయిలు ఇదేవిధంగా ఉన్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి పంపాం
- జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప
రైతువేదిక భవనాలకు అవసరమైన నిర్వహణ నిధులు రావాల్సి ఉంది. ఇదే విషయాన్ని పైఅధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలిపాం. రానున్న రోజుల్లో రైతులను సమన్వయం చేయాలన్నా, సమాచారం చేరవేయలన్నా, శిక్షణ తరగతులు నడపాలన్నా ఈ వేదికలే క్రీయాశీలకంగా మారనున్నాయి. నిర్వహణ నిధుల రాక ఆలస్యం అయినా ఏఈవోల బాధ్యతాయుతంతో భవనాలు వినియోగంలో ఉన్నాయి.