Share News

తలచినదే.. జరిగినది..!

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:37 PM

సీనియర్‌ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ చర్యల విషయంలో తలచినదే జరిగినదనే భావన వ్యక్తమవుతోంది.

తలచినదే.. జరిగినది..!
వనపర్తిలో బోసిపోయిన చిన్నారెడ్డి నివాసం

- సీనియర్‌ నేత చిన్నారెడ్డిపై వేటు వేసిన అధిష్ఠానం

- ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ పదవి నుంచి తొలగింపు

- పనిచేసిన మేఘారెడ్డి మంత్రాంగం.. బీసీ, రెడ్డి ప్రభావం

- పార్టీ పదవిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోని కాంగ్రెస్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 3, (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ చర్యల విషయంలో తలచినదే జరిగినదనే భావన వ్యక్తమవుతోంది. ఆగస్టు 16వ తేదీన వనపర్తి జిల్లా, గోపాల్‌పేటలోని ఓ కార్యక్రమంలో చిన్నారెడ్డి పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో పాటు అధిష్ఠానానికి డబ్బులు ఇచ్చి టిక్కెట్లు తెచ్చుకున్నారని విమర్శలు చేశారు. అవసరమైతే పార్టీలోనే ఉంటూ జీవన్‌రెడ్డిలా తిరగబడతానని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత కొండా సురేఖ కూతురు ఉదంతం.. ఇతర ఎమ్మెల్యేల సమావేశం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి సీరియస్‌గా తీసుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగాయి. క్రమశిక్షణా సంఘం కూడా గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కదిలింది. ఫిర్యాదు అందిన కొద్దిరోజుల్లోనే నివేదికను తయారు చేసి అధిష్ఠానానికి పంపించింది. చరిత్రలో ఎన్నడూ లేనంత తొందరగా రాష్ట్రంలోని సీనియర్‌ నేతలపై ప్రభుత్వం వేటు వేసింది. ఓవైపు కొండా సురేఖను భర్తరఫ్‌ చేయగా.. మరోవైపు డాక్టర్‌ చిన్నారెడ్డిని పదవి నుంచి తప్పించింది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత క్రమశిక్షణా చర్యల విషయంలో నిర్ణయం జరుగుతుందని అందరూ భావించడంతో పాటు.. గతంలో లేనంత కఠిన చర్యలు ఉంటాయని, మందలింపుతో సరిపెట్టబోరనే వాదనను ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ నిర్ణయంతో సమర్థించింది.

ఫలించిన మంత్రాంగం...:

వనపర్తి కాంగ్రెస్‌ టిక్కెట్‌ నిరాకరించినప్పటి నుంచి ఏదో రకంగా చిన్నారెడ్డి విమర్శలు చేస్తూనే ఉన్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులకు మద్దతు ఇచ్చారనే విమర్శ కూడా ఉంది. అయితే టిక్కెట్‌ నిరాకరించామనే భావనతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బాధ్యతలను అప్పగించింది. నియోజకవర్గ పంచాయితీల్లో వేలు పెట్టకుండా ఉండేందుకు ప్రజావాణి ఇన్‌చార్జిగా కూడా చేశారు. అయినా ఏదో ఒక అడ్డంకి ఉంది. మేఘారెడ్డి, ఆయన వర్గం కూడా ఉన్నత పదవిలో ఉన్నారనే ఉద్దేశంతో అందరూ సంయమనం పాటించారు. అయితే ఇటీవల నేరుగా బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యతో మేఘారెడ్డి కూడా సీరియస్‌గా స్పందించారు. మీడియా సమావేశం పెట్టడంతో పాటు అనుచరవర్గంతో గాంధీభవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేసి.. ఆ వెంటనే ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. తనకున్న పరిచయాలతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంత్రాంగం నడిపారు. దీంతో చిన్నారెడ్డిపై చర్యలు ఖాయమనే భావన ఓవైపు వ్యక్తమైనా.. సీనియర్‌ నాయకుడు, గాంధీ కుటుంబానికి లాయల్‌ కాబట్టి మందలించి వదిలేస్తారని మరోవైపు భావించారు. కానీ ఎట్టకేలకు అన్ని విషయాలను పక్కన పెట్టి అధిష్ఠానం ఆయనను పదవి నుంచి తొలగించింది. ఒక దశలో ప్రభుత్వ పదవిలో ఉంచి.. పార్టీ పదవి నుంచి తప్పిస్తారని చర్చ జరిగినా.. పార్టీపరమైన చర్యలకు ఉపక్రమించలేదు.

రెండు వివాదాలతోనే...

ఒక్క చిన్నారెడ్డి మాత్రమే ఈ చర్యల్లో భాగంగా ఉంటే అధిష్ఠానం ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకునేది కాదనే అభిప్రాయం ఉంది. చిన్నారెడ్డి వ్యాఖ్యల తర్వాత రోజే కొండ సురేఖ కూతురు వ్యాఖ్యలు చేయడం.. రెండు వివాదాలూ ఏక కాలంలో పార్టీని చికాకు పెట్టడంతో క్రమశిక్షణ విషయంలో హెచ్చరికలు జారీ చేయాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాఖ్యల వల్ల ఓవైపు పార్టీపై.. మరోవైపు సీఎం, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భావించింది. అయితే ఇద్దరిపై చర్యల నిర్ణయం ప్రకటించడానికి మరో కారణం ఉంది. అదే సామాజిక వర్గ కారణం.. కొండా సురేఖ షోకాజ్‌ నోటీసుకు సరైన వివరణ ఇవ్వకపోవడం, చిన్నారెడ్డి వివరణ ఇచ్చినా. దానిపై అధిష్టానం సంతృప్తి చెందలేదు. అయితే కొండ సరేఖకు సంబంధించి సీరియస్‌నెస్‌ పెరుగుతుండటం.. ఆమెపై వేటు వేస్తే బీసీలపై చర్యలుగా అభివర్ణిస్తారని భావించిన పార్టీ.. చిన్నారెడ్డిపైనా చర్యలను తీసుకుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇప్పటికే కొండా సురేఖ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని ప్రకటించారు. చిన్నారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కచ్చితంగా పార్టీని వీడే ఆలోచన ఉండదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై చిన్నారెడ్డి మాత్రం స్పందించలేదు. మరి భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Updated Date - Sep 03 , 2026 | 11:37 PM