మార్చడం వెనుక మతలబేంటి...?
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:40 PM
రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణ, పోస్టుల కేటాయింపు, జీతాల చెల్లింపు, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు గందరగోళంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మహబూబ్‌నగర్‌లో పాత ఏజెన్సీలను మొత్తం రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
- ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు టెండర్లలో గందరగోళం
- టెండర్లలో అన్ని జిల్లాల నుంచి పాల్గొన్న ఏజెన్సీలు
- నాన్‌లోకల్ వారికే మెజారిటీ పోస్టులు !
- గతంలో నుంచి జిల్లాలో 29 ఎంప్యానల్ ఏజెన్సీలు
- అందులోనూ 19 ఏజెన్సీలకే పోస్టుల కేటాయింపులు
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 3, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణ, పోస్టుల కేటాయింపు, జీతాల చెల్లింపు, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు గందరగోళంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మహబూబ్‌నగర్‌లో పాత ఏజెన్సీలను మొత్తం రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవడం వెనుక మతలబు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందులోనూ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏజెన్సీలపై ఒక ఆడిటింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈ కొత్త నిర్ణయం కొంత విస్మయం కలిగిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో నుంచి 29 ఎంప్యానల్డ్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలోనూ కేవలం 19 ఏజెన్సీలకు మాత్రమే 928 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేసేవారు. మిగతా 10 ఏజెన్సీలకు ఇంతవరకు పోస్టుల కేటాయింపే చేయలేదు. కొత్త పోస్టులు మంజూరైతే వాటికి కేటాయింపులు చేయవచ్చు. అయితే గతంలో టెండర్ల ద్వారా కాకుండా నామినేటెడ్ పద్ధతిలోనే ఏజెన్సీలకు పోస్టులు కేటాయించేవారు. గతంలో ఉన్న ఔట్‌సోర్సింగ్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్లు నాన్‌లోకల్‌కు ఇవ్వడం వల్ల ఉద్యోగులకు సరైన సేవలు అందించడం, బాధ్యత వహించడంలో ఇబ్బంది అవుతుందని, టెండర్లు వేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొనడం వల్ల ఇబ్బందులు అవుతాయని భావించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా టెండర్లు వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 ఏజెన్సీలు పాల్గొన్నాయి. వాటికి పోస్టులు కేటాయించారు. ఇందులో ఏజెన్సీలకు దక్కిన అత్యధిక పోస్టులు 42 మాత్రమే కాగా.. అత్యల్పంగా 16 పోస్టులు మాత్రమే దక్కాయి. మొత్తం 894 పోస్టులను 33 ఏజెన్సీలకు పంపిణీ చేశారు.
తక్కువ పోస్టులతో సేవలు ఎలా...?
గతంలో ఔట్‌సోర్సింగ్ పోస్టుల కేటాయింపు చాలా తక్కువ ఏజెన్సీలకు ఎక్కువ పోస్టులు చేసేవారు. దీనివల్ల వచ్చే కమీషన్‌తో వారు ఒక ఆఫీసు పెట్టుకోవడం, ప్రత్యేకంగా ఉద్యోగిని నియమించుకోవడం, తన వద్ద సేవలు అందించేవారికి అందుబాటులో ఉండే వ్యవస్థను నిర్మించుకునేవారు. కానీ ఇప్పుడు పోస్టులను తక్కువ మొత్తంలోనే ఎక్కువ ఏజెన్సీలకు విభజించడం వల్ల వారికి వచ్చే కమీషన్‌లో వ్యవస్థను నడపటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏజెన్సీలకు వచ్చే కమీషన్లు సరిపోక.. ఉద్యోగుల జీతాల్లో కోతలు వేయడం, పీఎఫ్, ఈఎస్‌ఐ జమ చేయకపోవడం, లేని, రాని ఉద్యోగుల దొంగ అటెండెన్స్, డిపార్ట్‌మెంట్ హెడ్స్‌తో కలిసి వేసుకుని వేతనాలు పొందడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. ఇప్పుడు వచ్చే కమీషన్‌లో ఇంకెంత కోతలు వేస్తారు? ఎన్ని నెలలకోసారి వేతనాలు వస్తాయోననే అందోళన నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానంగా ఉద్యోగుల వేతనాల విషయంలో చాలా సీరియస్‌గా దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో ఆలస్యంగా వచ్చే వేతనాలను ఒకటో తేదీన టంచనుగా పడుతుండగా.. ఔట్ సోర్సింగ్ వేతనాలు పడటం లేదని తెలిసి.. ఆ శాఖపై దృష్టి పెట్టారు. ఇంకా కొన్నిచోట్ల మూడు నెలలకు, రెండు నెలలకు వేతనాలు పడుతున్నాయి. అందుకే ఏజెన్సీలకు సంబంధించి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీ విభాగం ద్వారా ఆడిటింగ్‌కు ఆదేశించారు. అది ఒకవైపు కొనసాగుతుండగానే మహబూబ్‌నగర్‌లో టెండర్ల గందరగోళం నెలకొంది.
నాన్‌లోకల్ ఏజెన్సీలతో కష్టమే..
అదును చూసి అడుగు వేయాలని ఒక నానుడి ఉంది.. ఎక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా ఆ సమయంలో అవసమరమయ్యే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. చట్టంలో ఉన్నా.. ఉన్న ఏజెన్సీలను ఒక్కసారిగా రద్దు చేసి.. కొత్తగా టెండర్లకు వెళ్లారు. అత్యధికంగా ఒక ఏజెన్సీకి 42 పోస్టులు దక్కగా.. వాటికి వచ్చే మొత్తం కమీషన్ చాలా తక్కువ. అందులోనూ పీఎఫ్, లేబర్ లైసెన్స్ ఫీజులు, ఐటీ రిటర్న్స్, ఇతర సర్టిఫికెట్లు, సర్వీసు ట్యాక్స్ ప్రతీఏటా ఏజెన్సీ చెల్లించాలి. కానీ వచ్చే కమీషన్ తక్కువగా ఉంటే కచ్చితంగా ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తాయి. కొత్త పోస్టులు ఇచ్చినప్పుడు ఉద్యోగాల పేరుతో దోపిడీకి పాల్పడి, పోస్టులను అమ్ముకున్న సందర్భాలు ఉంటాయి. అయితే అంత తక్కువ పోస్టుల కోసం స్థానికంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నియమించుకోవడం కూడా నాన్‌లోకల్ ఏజెన్సీలకు కష్టమే.. గతంలో ఉన్న ఏజెన్సీలకు ఉమ్మడి పాలమూరులోని అయిదు జిల్లాల్లో పోస్టుల కేటాయింపులు ఉండటంతో అన్నీ కలిపి ఏదో ఒక జిల్లాలో ఆఫీసులు పెట్టుకుని బాధ్యతలు నిర్వహించేవారు. ఉదాహరణకు నిజామాబాద్‌కు చెందిన ఒక ఏజెన్సీకి ఎస్సీ అభివృద్ధిశాఖలో 27 పోస్టులు దక్కాయి. ఆ ఉద్యోగుల బాధ్యతను ఆయన అక్కడి నుంచి నిర్వహించాలంటే కష్టమైన పనిగా ఉంటుంది. దీంతో నాన్‌లోకల్ ఏజెన్సీలకు కాకుండా లోకల్ ఏజెన్సీలకు కేటాయింపులు చేయాలని, ఒకవేళ ఏజెన్సీల నిర్వహణలో లోపాలు ఉంటే వాటిని రద్దు చేయవచ్చని.. ఇటీవల కొందరు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు.
నిబంధనల ప్రకారమే మార్చాం
ఏజెన్సీల మార్పును నిబంధనల ప్రకారమే చేశాం. తక్కువ పోస్టులు ఇచ్చామంటే ఏజెన్సీలు ఇష్టపడి తీసుకున్నప్పుడు మనం చేయడానికి ఏం లేదు. దీనివల్ల కమీషన్ తక్కువగా వస్తే ఏజెన్సీలే భరించుకోవాలి. ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటాం.
- మైత్రిప్రియ, జిల్లా జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి