బీసీ హాస్టళ్లలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:12 PM
ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తోంది.
- వసతి గృహాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు
- వార్డెన్ల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా...
- ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
వనపర్తి విద్యా విభాగం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన హాస్టళ్లలో తరచూ ఆహార సంబంధిత అనారోగ్య ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు , కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్న ఘటనలు ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలతో ఆహార నాణ్యత తాగునీటి శుభ్రత, వంట గదుల పరిశుభ్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వనపర్తి జిల్లాలో పరిస్థితి ఇలా..
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 15 బీసీ సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో 9 ప్రీమెట్రిక్, 6 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టళ్ల పరిధిలో దాదాపు 2200 మంది విద్యార్థులు ఉండి చ దువుకుంటున్నారు.
ఈ ఏడాది జనవరిలో కొత్తకోటలోని బీసీ బాలికల వసతి గృహంలో రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో సుమారు 32 నుంచి 40 మంది వరకు వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే విచారణ చేపట్టిన ఆ వసతి గృహ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
వనపర్తి పట్టణంలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదనే ఆరోపణలు ఉండడం, విద్యార్థుల పొట్టి కొట్టి ఈ ఏడాది ఆగస్టు 21న, 21 క్వింటాళ్ల బియ్యాన్ని దారి మళ్లిస్తున్న విషయాన్ని విద్యార్థి సంఘాలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు విచారణ చేపట్టి ఆ వసతి గృహ అధికారిని సస్పెండ్ చేశారు.
అక్టోబరు మొదటి వారంలో పెబ్బేరు శివారులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల బీసీ వసతి గృహంలో రాత్రి భోజనం వికటించి సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో వడ్డించిన చికెన్ తిన్న కొద్ది గంటలకే విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, వాంతులు, జ్వరం, నీరసంతో ఇబ్బంది పడ్డారు. ఆ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనలతో పాటు ఇటీవల నెల రోజుల క్రితం వనపర్తి పట్టణంలోని ఒక బీసీ బాలికల వసతి గృహాన్ని ఆ శాఖ ఉన్నతాధికారి పరిశీలించారు. హాస్టల్లో పరిశుభ్రంగా లేకపోవడం, మెనూ ప్రకారం సమయానికి భోజనం అందించకపోవడం ఇతరాత్ర కారణాలతో సంబంధిత హాస్టల్ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మెమో జారీ చేస్తానని హెచ్చరించారు.
వసతి గృహాలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం
వనపర్తి జిల్లాలోని అన్ని బీసీ వసతి గృహాలను క్రమం తప్పకుండా నిత్యం పరిశీలిస్తున్నాం. ఇటీవల పెబ్బేరు వసతి గృహంలో చోటు చేసుకున్న ఘటనపై విచారణ జరుగుతుంది. ముందు ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
-ప్రమీల, సహాయ బీసీ అభివృద్ధి అధికారి