Share News

బిరబిరా పరుగులేవి..!

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:09 PM

బిరబిరా పరుగులేవీ.. ఉరకలెత్తే ప్రవాహమేదీ.. ఏమి కాలమిది.. ఎంత దైన్యమిది.. అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.

బిరబిరా పరుగులేవి..!
జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నది పరిస్థితి

- శ్రీశైలం ప్రాజెక్టుకు 40 ఏళ్లలో నాలుగోసారి అతి తక్కువ వరద రాక

- ఎక్కడా పంటలకు నీరివ్వలేని స్థితి.. తాగునీటికే ప్రాధాన్యం

- తుంగభద్ర నుంచి శ్రీశైలానికి ఈ ఏడు చేరని చుక్కనీరు

- 2003, 2015, 2023 తర్వాత ఇంత దుర్భర పరిస్థితి

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) బిరబిరా పరుగులేవీ.. ఉరకలెత్తే ప్రవాహమేదీ.. ఏమి కాలమిది.. ఎంత దైన్యమిది.. అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. నీరు లేక బోసిపోయిన కష్ణమ్మను చూసి కంట తడి పెడుతున్నారు. నీటితో కళకళలాడాల్సిన పంట కాలువలు నీటి చెమ్మ కోసం ఆరాటపడుతున్నాయి. పచ్చని పంటలతో అలలారాల్సిన ఆయకట్టు నెర్రలుబారి దుఃఖిస్తోంది. ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో కృష్ణానదికి అత్యల్పంగా వరదలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌ మూడో వారం గడుస్తున్నా.. ఆశించిన వరదలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెలాఖరు వరకు కూడా వర్షాలు కురుస్తాయనే ఆశాభావం కూడా వ్యక్తం కావడం లేదు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 40 శాతం పంటలు ఎండిపోగా.. ఉన్న పంటలను రక్షించుకుందామంటే వరుణుడు కరుణించక.. కాలువల నుంచి నీటి విడుదల లేక రైతులు అరిగోస పడుతున్నారు.

గేట్లు ఎత్తని ‘శ్రీశైలం’

ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కృష్ణానదిపై కీలకంగా ఉన్న ప్రాజెక్టు శ్రీశైలం.. ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తారంటే పాలమూరు నుంచి నల్గొండ వరకు, ఆపై కృష్ణా డెల్టా రైతుల వరకు ఎంతో సంబరపడతారు. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు గేట్లు ఎత్తలేదు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా కొన్ని నీళ్లు దిగువకు వెళ్లాయి. నాలుగు దశాబ్దాల్లో శ్రీశైలం ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఇది నాలుగోసారి.. 2003-2004 నీటి సంవత్సరంలో 157.047 టీఎంసీల నీరు రాగా.. ఆ తర్వాత 11 ఏళ్లపాటు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. 2015-2016 నీటి సంవత్సరంలో అత్యంత తక్కువ అంటే కేవలం 73.600 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ఆ తర్వాత 2023-2004 వాటర్‌ ఈయర్‌లో 140.860 టీఎంసీల వరద రాగా.. ఆ తర్వాత ఈ ఏడాదే తక్కువ వరద నమోదైంది. కేవలం 216.100 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. అయితే అప్పటికీ.. ఇప్పటికీ.. శ్రీశైలంపై ఆధారపడిన ప్రాజెక్టుల సంఖ్య పెరిగింది. హైడల్‌ విద్యుత్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కాస్తా.. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది. పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి, ముచ్చుమర్రి, హంద్రీనీవా, తెలుగుగంగతో పాటు మిషన్‌ భగీరథ గ్రిడ్‌ కూడా దీనిపైనే ఆధారపడి ఉండటం గమనార్హం.

చెరువులు నింపేందుకే...

ఇటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం వరకు తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణానది ఆధారంగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్రా జిల్లాలకు ఈ నది నీరే ఆధారం.. కానీ ఎల్‌నీనో కారణంగా శ్రీశైలం వరకే వరద పరిమితమైంది. అది కూడా నాలుగు దశాబ్దాల్లో నాలుగోసారి తక్కువ వరద నమోదు అయ్యింది. అయితే ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఎల్‌నీనో ప్రభావం కొనసాగే అవకాశం ఉండటం, ఆ తర్వాత వేసవిలో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో ఉభయ రాష్ర్టాల ఇరిగేషన్‌ అధికారులు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తున్నారు. 2015-16లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జూరాల డెడ్‌ స్టోరేజీ బురదలో నుంచి నీటిని తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడా పరిస్థితి రావొద్దని.. జూరాల, శ్రీశైలంతోపాటు ఎత్తిపోతల పథకాల కింద ఉన్న అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వను అలాగే ఉంచుతున్నారు. జూరాల నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. 8.869 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. శ్రీశైలంలో 215 టీఎంసీలకు గాను 87.24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వెలుగొండ, పోతిరెడ్డిపాడు, హంద్రీనివాకు ఏపీ 8700 క్యూసెక్కులు తరలిస్తుండగా.. జలవిద్యుత్‌ కోసం 16 వేల క్యూసెక్కుల నీటిని తెలంగాణ విడుదల చేస్తుండటంతో నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. చెరువులు నింపి తాగునీటి అవసరాల కోసం విడుదల చేసుకుంటున్నామని ఏపీ వాదిస్తుండగా.. తెలంగాణ వైపు కేవలం కల్వకుర్తికి 2400 క్యూస్కెక్కులు సాగునీటి కోసం మిగతాది విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌కు చేరుతోంది.

తుంగభద్ర నుంచి అంతే...

శ్రీశైలం జలాశయానికి చేరే వరదలో మెజారిటీ భాగం కృష్ణానది నుంచి వస్తున్నప్పటికీ.. తుంగభద్ర నుంచి కూడా ప్రతీ ఏటా వరద భారీగానే చేరుతోంది. అలాంటిది తుంగభద్ర డ్యామ్‌కే ఈ ఏడాది తక్కువ వరద నమోదైంది. గడిచిన 50 ఏళ్లలో ఈ డ్యామ్‌కు తక్కువ వరద నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక శ్రీశైలంకు ఈ ప్రాజెక్టు నుంచి చుక్కనీరు చేరలేదు. డ్యామ్‌కు తక్కువ వరద నమోదుతో అటు ఏపీలోని కర్నూలు జిల్లాలో ఎల్‌ఎల్‌సీ (లో లెవల్‌ కెనాల్‌) కింద, ఇటు ఇతర జిల్లాలో హెచ్‌ఎల్‌సీ (హై లెవల్‌ కెనాల్‌) కింద 4.30 లక్షల ఎకరాల సాగుపై ప్రభావం పడింది. తెలంగాణ వైపు ఆర్డీఎస్‌ ఎడమకాలువకు చుక్కనీరు వచ్చే అవకాశం లేకపోగా.. దాని ప్రత్యామ్నాయమైన తుమ్మిళ్ల పంపులకు నీరందడం లేదు. సుంకేసుల జలాశయానికి వరద రాకపోవడమే ఇందుకు కారణం.. దీంతో దాదాపు 85,700 ఎకరాలపై తుంగభద్ర లోటు వరద ప్రభావం పడనుంది. 2016-17 వాటర్‌ ఈయర్‌లో కేవలం 85.719 టీఎంసీల వరద రాగా.. దాని తర్వాత ఈ సంవత్సరమే 110.208 టీఎంసీల వరద వచ్చింది. ఈ నీటి సంవత్సరంలో 183.22 టీఎంసీల వరద వస్తుందని అంచనా వేసుకోగా.. కేవలం 110 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ఇకపై పెద్దగా వరద వచ్చే అవకాశాలు లేవు. మొత్తంగా ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదుల నుంచి వరద రాకపోవడంతో రైతాంగం, తాగునీటిపై తీవ్ర ప్రభావం పడనుంది.

Updated Date - Oct 01 , 2026 | 11:28 PM