Share News

వీకెండ్‌ వేటగాళ్లు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:40 PM

వారాంతాల్లో వేటగాళ్లు చెలరేగిపోతు న్నారు.

వీకెండ్‌ వేటగాళ్లు

- స్థానికులతో కలిసి హైదరాబాద్‌ వాసుల వేట

- తుపాకీ తూటాలకు బలవుతున్న వన్య ప్రాణులు

- కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో జల్సాలు

- మాంసాన్ని తరలిస్తూ పట్టుబడుతున్న నిందితులు

నారాయణపేట, సెప్టెంబరు 29 (ఆంధ్ర జ్యోతి) : వారాంతాల్లో వేటగాళ్లు చెలరేగిపోతు న్నారు. జిల్లాలోని కృష్ణ, మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లోని కృష్ణానది పరివాహక ప్రాంతాలు, ఊట్కూర్‌ మండలం, కర్ణాటక సరిహద్దు గ్రా మాల పరిధిలోని వాగుల పరిసరాల్లో జింకలు, నెమళ్లు అధిక సంఖ్యలో సంచరిస్తూ ఉంటాయి. వాటిని వేటాడేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు జిల్లావాసులతో తమకున్న పరిచయాలతో జల్సాల కోసం వీకెండ్‌లో వస్తున్నారు. జింకలు, నెమళ్లు, కుందేళ్లు, పావురాలను వేటాడుతున్నారు. వాటి మాంసాన్ని వండుకుని తిని జల్సాలు చేసుకుంటున్నారు. అయితే కొందరు వన్యప్రాణుల మాంసాన్ని తమ వెంట వాహనాల్లో తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.

నారాయణపేట జిల్లాలో 8,452 హెక్టార్ల అడవి

నారాయణపేట జిల్లాలో 8452.72 హెక్టార్ల అటవీ ప్రాంతాలున్నాయి. మినాస్‌పూర్‌, కోటకొండ రిజర్వు ఫారెస్టు బ్లాకులు ఉన్నాయి. కృష్ణ మండలం తంగిడి వద్ద జిల్లాలో ప్రవేశించే కృష్ణానది భీమా నదితో సంగమించి మాగనూర్‌, మక్తల్‌ మండలాల మీదుగా ప్రవహిస్తోంది. ఈ నది పరివాహక ప్రాంతాలతో పాటు వాగులు, మైదాన ప్రాంతాల్లోని పొదలు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. వేటగాళ్లు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ వాటిని వేటాడుతున్నారు.

ఇటీవల జరిగిన సంఘటనలు

  • ఈ నెల 27న ఊట్కూర్‌ మండలం లక్ష్మీ పల్లి దర్గా పరిసర ప్రాంతాల్లో స్థానికుడైన రియాజ్‌తో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది కృష్ణ జింకను వేటాడారు. దాని మాంసాన్ని తమ వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తూ రాయికల్‌ టోల్‌ ప్లాజా వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఊట్కూర్‌కు చెందిన ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ ద్వారా నిందితులు రియాజ్‌కు పరిచయం అయినట్లు తెలుస్తోంది.

  • మక్తల్‌ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన కే శేఖర్‌, హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్‌ హుసేన్‌, అబ్దుల్లా బిన్‌ సహైన్‌, సాద్‌బిన్‌ మొహ్మద్‌ బలాబ్‌, మహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌, జడ్చర్లకు చెందిన మీర్‌ అమీర్‌ అహ్మద్‌లు కలిసి జింకలు, నెమళ్లను వేటాడేవారు. వాటి మాంసాన్ని వండుకొని తిని అవశేషాలను జూరాల బ్యాక్‌ వాటర్‌ కాలువలో పడే సేవారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ గోల్కొండ టాస్క్‌పోర్స్‌ బృందం, అటవీ శాఖ అధికారులు గుర్తించి గత మే 5న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - Sep 29 , 2026 | 11:40 PM