Share News

ధర్మం మీద దాడులు సహించం

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:21 PM

తెలంగాణలో పరిస్థితులను రెండేళ్లుగా నిశితంగా గమనిస్తున్నామని, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్‌ నబీన్‌ అన్నారు.

ధర్మం మీద దాడులు సహించం
మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నతిన్‌ నబిన్‌

రెండేళ్లుగా తెలంగాణలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం

ఒక వర్గానికే కొమ్ము కాసే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన

మహిళల సంక్షేమానికి నారిశక్తి పేరుతో బీజేపీ అనేక కార్యక్రమాలు

ప్రతీ బూత్‌లో 50 శాతం ఓట్ల లక్ష్యం సాఽధించాలి

మహబూబ్‌నగర్‌ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో పరిస్థితులను రెండేళ్లుగా నిశితంగా గమనిస్తున్నామని, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్‌ నబీన్‌ అన్నారు. ధర్మం మీద దాడులను బీజేపీ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ కాలేజీ మైదానంలో మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని బూత్‌ స్థాయి కార్యకర్తల సమ్మేళనాన్ని బుధవారం నిర్వహించారు. నితిన్‌ నబిన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి.. ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. రూ.లక్ష నగదుతోపాటు కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మోసం చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా ఇదే పంథాను అవలంభించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కూడా కాంగ్రెస్‌ దగా చేస్తోందని, ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రధాని మోదీ మహిళల సంక్షేమం కోసం నారీ శక్తి పేరుతో అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్‌శాతం పెరిగిందని, పార్లమెంట్‌ నాటికి 35 శాతానికి చేరుకుందని అన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రతీ బూత్‌లో 50 శాతం ఓట్ల లక్ష్యంతో కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ అంటే ఆ పార్టీలకు భయం : రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు

భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు భయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఉమ్మడి జిల్లా బూత్‌ స్థాయి నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున బీజేపీ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు. మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురుతుందన్నారు.

బీజేపీ జెండా ఎగరడం ఖాయం: ఎంపీ డీకే అరుణ

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లోపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మేదీజీకి ప్రజలు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, కార్పొరేషన్‌ను కట్టబెడితే కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు.

సభ విజయవంతం

బీజేపీ ఉమ్మడి జిల్లా బూత్‌ స్థాయి కార్యక్తల సభ విజయవంతం అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి బూత్‌ స్థాయి కార్యకర్తలు, నాయకులు సభకు తరలివచ్చారు. దాంతో శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

జాతీయ అధ్యక్షుడికి ఘన స్వాగతం

మొదటి సారి జిల్లాకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎంపీ రాములు గజమాల, శాలువులతో ఘనంగా సన్మానించారు. నితిన్‌ నబిన్‌ హిందీలో మాట్లాడగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ తెలుగులో అనువాదం చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 11:21 PM