బాధితులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:33 PM
నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు తెలిపారు.
- నక్కలగండి రిజర్వాయర్ ముంపు బాధితులకు మౌలిక వసతులతో పునరావాసం
- రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు తెలిపారు. బుధవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంతో నీటి ముంపునకు గురవుతున్న మార్లపాడు తండా, కేశ్యతండాలను సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ముంపు బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ని అందించి పునరావాసం కల్పించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన బాధితులకు అవగాహన కల్పించారు. అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ లో కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలోని మర్లపాడు, కేశవతండా గ్రామాల ప్రజల ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి పరిహారం అందించాలన్నారు. నిర్వాసితులకు జీవనోపాధి దెబ్బతినకుండా వారికి ఉపాధి అవకాశాలు, పునరుద్దరణ చర్యలు చేపట్టాలన్నారు. పరిహారం చెల్లింపులు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని ఆదేశించారు. భూసేకరణ నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుం డా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఇరిగేషన్, నేషన ల్ హైవేశాఖ, సాగునీటి ప్రాజెక్టుల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.