వనపర్తి టు ఢిల్లీ.. వయా గాంధీభవన్..!
ABN , Publish Date - Aug 19 , 2026 | 12:21 AM
వనపర్తి కాంగ్రెస్ పంచాయితీ రెండు రోజుల్లో ఢిల్లీకి చేరనుంది.
- శ్రేణులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు.. చర్యలకు పట్టు
- నేడు లేదా రేపు ఢిల్లీలో ఖర్గే, రాహుల్, మీనాక్షిని కలిసే ఛాన్స్
- ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్
వనపర్తి కాంగ్రెస్ పంచాయితీ రెండు రోజుల్లో ఢిల్లీకి చేరనుంది. ఈ మేరకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. వనపర్తి టూ ఢిల్లీ... వయా గాంధీభవన్ గా ఈ పంచాయితీ మారింది. ఆకాశరామన్న ఉత్తరా లు, ఫిర్యాదులే ఉండే ప్రాంతంలో బహిరంగ ఆరోపణ లతో వనపర్తి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కగా.. ఇ న్నాళ్లు చిన్నారెడ్డి వర్గం నుంచి వస్తున్న విమర్శలను సీరియస్‌గా తీసుకోని ఎమ్మెల్యే మేఘారెడ్డి.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల గోపాల్‌పేట మండలంలోని సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి... ఎమ్మెల్యే మేఘారెడ్డి పై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయగా.. దాన్ని సీరియస్‌గా తీసుకున్న మేఘారెడ్డి.. ముందుగా క్రమ శిక్షణా సంఘం చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. తర్వాత మంగళవారం నేరుగా వనపర్తి నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో గాంధీభవన్‌కు వెళ్లిన ఆయన.. చిన్నారెడ్డిపై చర్యలకు డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీలో సీనియర్ అయిన చిన్నారెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న తనపై, పార్టీపై, అధిష్ఠానంపై చేసిన వ్యాఖ్య ల మీద కచ్చితంగా విచారణ చేసి చర్యలు తీసుకోవా లని కోరారు. అదే సమయంలో నిరంజన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నారెడ్డి, ఆయన పీఏ భాస్కర్ కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే ఎవరితో మాట్లాడి చిన్నా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారో.. దానివల్ల పార్టీకి ఎంత నష్టమో తెలిసిపోతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేడు హస్తినకు..
చిన్నారెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎమ్మె ల్యే మేఘారెడ్డి.. టిక్కెట్ పంచాయితీ ముగిసి.. ఇన్నాళ్ల యినా ఆయన అసంతృప్తి వెళ్లగక్కుతుండటంతో ఇకపై పలుచన కావొద్దని భావించినట్లు తెలుస్తోంది. ఒకేసారి పార్టీలోని అసంతృప్తివాదులను, ప్రతిపక్షంలో ఉన్న వారిని ఇరుకున పెట్టే అవకాశం దొరకడంతో వదులు కోవద్దని కేడర్ కోరుతోంది. అయితే, గాంధీ భవన్‌లో మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత మీనాక్షి నటరాజన్‌కు ఇవ్వాలని చూసినప్పటి కీ.. ఆమె సీడబ్ల్యూసీ సమావేశం నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడంతో.. కలవలేదు. అయితే, తానే ఢిల్లీకి వెళ్తే.. హై కమాండ్ లెవల్‌లో పంచాయితీ అర్థమై.. కచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మేఘారెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నలుగురు అగ్ర నేత ల అపాయింట్‌మెంట్ కోరగా.. అవకాశాన్ని బట్టి బుధ లేదా గురువారం కలుస్తారని సమాచారం. ఈ మేరకు బుధవారం మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల్లో టిక్కెట్ మారినప్పటి నుంచి నేటి వరకు వీడియో, ఆడియో, వ్యాఖ్యల క్లిప్పింగులు తదితర ఆధారాలన్నిం టితో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కలిసి రాలేదని, ప్రతిపక్షాలకు మద్దతి చ్చారనే విమర్శ కూడా చిన్నారెడ్డిపై గతం నుంచి ఉంది. వాటన్నింటినీ ఢిల్లీ పెద్దలకు ఇచ్చే ఫిర్యాదులో పేర్కొంటామని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
సీనియర్లూ గుర్రు...
అసెంబ్లీ ఎన్నికలకు ముందు వనపర్తిలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా షాద్ నగర్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్నా కేడర్‌ను పట్టించుకోవడం లేదని, దాని వల్ల తాము రాజకీయంగా నష్టపోతున్నామని ఆరోపిం చారు. చిన్నారెడ్డి హఠావో.. కాంగ్రెస్ బచావో నినాదాలు చేశారు. ఆయనకు తప్పా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాము పనిచేస్తామని చెప్పారు. అయితే అప్పట్లో పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా చిన్నారెడ్డి సమావేశంలో పాల్గొన్న మెజారిటీ సీనియర్లను పార్టీ నుంచి బహిష్కరించారు. అక్కడ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా చిన్నారెడ్డికి వ్యతిరేకంగా జరిగినా చర్యలు తీసుకోవడంతో.. ఇప్పుడు పార్టీకి.. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని అప్పటి సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు వారు కూడా సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. వనపర్తి సీనియర్లంతా సీఎంకు కూడా సుపరిచితులు కావడంతో ఈ రెండుమూడు రోజుల్లో వారు కూడా కలిసే అవకాశం ఉంది.