Share News

వత్తుగండ్ల పాఠశాల వంట ఏజెన్సీ రద్దు

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:14 PM

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక రద్దు చేశారు. కలెక్టర్‌ మంగళవారం పాఠశాలను తనిఖీ చేశారు.

వత్తుగండ్ల పాఠశాల వంట ఏజెన్సీ రద్దు
వంట ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతున్న నారాయణపేట కలెక్టర్‌ ప్రియాంక

హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

దామరగిద్ద, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక రద్దు చేశారు. కలెక్టర్‌ మంగళవారం పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నీళ్లచారు వడ్డించడంతో పాఠశాల ఉపాధ్యాయుడు, వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మెనూలో వెజిటబుల్‌ కర్రీ, సాంబార్‌ ఉందని, విద్యార్థులకు కేవలం నీళ్ల చారు వడ్డించడం ఏంటని ఏజెన్సీ నిర్వాహకులను నిలదీశారు. భోజనం నాణ్యతను పరిశీలించకుండా, రుచి చూడకుండా సంబంధిత ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని, విద్యార్థులకు ఎలా వడ్డింపచేశారని ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్‌ ఆ పాఠశాల వంట ఏజెన్సినీ రద్దు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని డీఈవో గోవిందరాజులును ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ గ్రామంలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్‌ పత్రాలు పూరించే ప్రక్రియను పరిశీలించారు. నాలుగు రోజుల్లో గ్రామంలోని ఓటర్ల అందరితో పత్రాలను తీసుకొని, డిజిటలైజేషన్‌ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సాయిబాబా, తహసీల్దార్‌ తిరుపతయ్య, బీఎల్‌ఓ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:14 PM