Share News

వనజారెడ్డి.. యోగాలో మేటి

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:58 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన వనజారెడ్డి అద్బుత ప్రతిభ కనబరుస్తున్నారు.

వనజారెడ్డి.. యోగాలో మేటి
వరల్డ్‌ యోగాసన చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన వనజారెడ్డి

- వరల్డ్‌ యోగాసన చాంపియన్‌షిప్‌లో ప్రతిభ

- ట్విస్టింగ్‌ యోగాసనంలో బంగారు పతకం

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన వనజారెడ్డి అద్బుత ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్ధార్‌ వల్లబాయ్‌పటేల్‌ పోలీసు అకాడమీలో ఏఎస్‌ఐ క్యాడర్‌లో ఉన్న వనజా అప్ప అకాడమీలో యోగా ట్రైనర్‌గా శిక్షణ ఇస్తున్నారు. ఇటు పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూనే యోగా.. మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వనజారెడ్డి 2012లో గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో అథ్లెటిక్స్‌లో రజత పతకం, 2014లో విశాఖపట్నంలో జరిగిన పోలీస్‌ మీట్‌లో 10 కిలో మీటర్ల నడకలో బంగారు పతకం పొందింది. అదే ఏడాది ఆదిలాబాద్‌(బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి యోగాలో బంగారు పతకం సొంతం చేసుకున్నారు. వైజాగ్‌లో జరిగిన పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో యోగాలో రజతం సాధించింది. 2017 జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్‌ రాష్ట్ర పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజతం పతకం అందుకున్నారు. 2018లో పోలీస్‌ సేవ పతకాన్ని అందుకున్నారు. అదే విధంగా 2019లో పలుసార్లు యోగా పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. 2023లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తాడేపల్లిగూడెంలో జరిగిన పోటీల్లో సత్తాచాటింది. గోవాలో జరిగిన ఆరో నేషనల్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో పాల్గొని స్వర్ణ పతకం సాధించింది. గచ్చిబౌలీ స్టేడియంలో పాన్‌ ఇండియా మాస్టర్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ నేషనల్‌ మాస్టర్స్‌ క్రీడల్లో లాంగ్‌జంప్‌, హైజంప్‌, 800 మీటర్ల పరుగులో మూడు పతకాలు సాధించారు.

వరల్డ్‌ యెగాసనలో బంగారు పతకం..

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మొదటి వరల్డ్‌ యోగాసన చాంపియన్‌షిప్‌లో సీనియర్‌-సి మహిళ ట్విస్టింగ్‌ యోగాసన (బాడి) విభాగంలో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉంది. మారుతున్న జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా చాలా అసవరం. యోగానే ఉత్తమ మెడిసిన్‌. భవిష్యత్తు దేశానికి మరిన్ని పతకాలు తేవడమే నా లక్ష్యం.

- వనజారెడ్డి, యోగా క్రీడాకారిణి

Updated Date - Jul 05 , 2026 | 11:59 PM