Share News

పంపిణీ కాని స్మార్ట్‌ రేషన్‌కార్డులు

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:02 PM

ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జడ్చర్ల మునిసిపాలిటీలో పంపిణీ కాకపోవడంతో ఎప్పుడు అందజేస్తారో అంటూ లబ్ధిఆరులు ఎదురుచూస్తున్నారు.

పంపిణీ కాని స్మార్ట్‌ రేషన్‌కార్డులు

- ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి రేషన్‌కార్డు లింకు

ఈనెల 19 నుంచి దరఖాస్తుల స్వీకరణ

జడ్చర్ల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు జడ్చర్ల మునిసిపాలిటీలో పంపిణీ కాకపోవడంతో ఎప్పుడు అందజేస్తారో అంటూ లబ్ధిఆరులు ఎదురుచూస్తున్నారు. మండల వ్యాప్తంగా మల్లెబోయిన్‌పల్లి, ఖానాపూర్‌ గ్రామాలు మినహ అన్ని గ్రామాల్లో స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ చేయగా, మునిసిపాలిటీలో ఇప్పటికీ చేపట్టలేదు. స్మార్ట్‌ రేషన్‌కార్డు లింకుతో ఉన్న ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తిప్పలు తప్పడం లేదు. కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా ఉన్న సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకంలో అర్హులైన కటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. ఈ పథకానికి 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వారు అర్హులు. 19-11-1967 నుంచి 18-11-2008 మధ్య కాలంలో జన్మించిన వారు దరఖాస్తుకు అర్హులని ఉత్తర్వులో పేర్కొంది. పథకం లబ్ధి పొందేందుకు దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు పత్రాలను జత చేయాల్సి ఉంది. అందరి వద్ద ఆధార్‌కార్డులు ఉన్నప్పటికీ స్మార్ట్‌ రేషన్‌కార్డులు పంపిణీ జరగకపోవడంతో దరఖాస్తు ఎలా చేసుకోవాలంటూ అర్హులు ప్రశ్నిస్తున్నారు. పథకంలో లబ్ధి పొందేందుకు ఈనెల 19 నుంచి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో విజయ్‌కుమార్‌, మునిసిపాలిటీ పరిధిలో మునిసిపల్‌ కమిషనర్‌ గిరీష్‌ ప్రకటనలు జారీ చేశారు. కానీ మల్లెబోయిన్‌పల్లి, ఖానాపూర్‌ గ్రామాలతో పాటు జడ్చర్ల మునిసిపాలిటీలో సైతం నేటికీ స్మార్ట్‌రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడంతో ఆయా పరిధిలోని అర్హులు, తాము దరఖాస్తు ఎలా చేసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 11:02 PM