సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 10:58 PM
మునిసిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు మంగళవారం జిల్లాకేంద్రం తో పాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో సమస్యా త్మక కేంద్రాలను ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు.
వసతులపై ఎస్పీ శ్రీనివాసరావు ఆరా
గద్వాల క్రైం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు మంగళవారం జిల్లాకేంద్రం తో పాటు జిల్లాలోని పలుప్రాంతాల్లో సమస్యా త్మక కేంద్రాలను ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. బందోబస్తు, వసతుల కల్పనపై ఆరా తీశారు. ఓటర్లు, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తిస్ధాయిలో అప్రమత్తతంగా ఉందని సూచించారు. సాయంత్రం పట్టణంలోని పలుసమస్యాత్మక పో లింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా పట్టణంలోని గంజిపేట పరిధిలోని మౌంటిస్సోరి పాఠశాల, వేదనగర్‌లోని దయానంద విద్యామందిర్, రాఘవేంద్రకాలనీలోని ప్రభుత్వ పాఠశాల, ఎం.ఏ.ఎల్.డీ, జూనియర్ కళాశాల తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ చేపట్టిన భద్రతా చర్యలు, పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు. అవసరమైన చోట మరింత అప్రమత్తం గా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. వివిధ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని గద్వాల డీఎస్పీ మొగిలయ్యతో చర్చించారు. ఇబ్బందికలుగకుండా, సమయానికి భోజనం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్‌ఐని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎస్పీతో డీఎస్పీ మొగులయ్య, గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.