Share News

మంచి భవిష్యత్‌ అందించడమే నిజమైన అభివృద్ధి

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:12 AM

పేద విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించడమే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వ విప్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

మంచి భవిష్యత్‌ అందించడమే నిజమైన అభివృద్ధి
విలేకరుల సమావేశంలో ఎంవిఎస్ జూనియర్ కాలేజీలో అభివృద్ధి మ్యాప్ ను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి

- తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మాదిరిగా ఎంవీఎస్‌ జూనియర్‌ కాలేజీ

- రూ. 70 కోట్లతో డిగ్రీ కళాశాల అభివృద్ధి.. 60వ వార్షికోత్సవం

- ప్రభుత్వ విప్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

పేద విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించడమే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వ విప్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహిచిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విదేశాల్లో ఏఐ మోడల్స్‌ అమల్లోకి వచ్చాయని, భవిష్యత్‌లో డ్రైవర్‌ ఉద్యోగాలను కూడా ఏఐ భర్తీ చేస్తుందన్నారు. అలాంటి సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఏటీసీల ద్వారా 97 శాతం ప్లేస్‌మెంట్‌ అవకాశాలను కల్పిస్తోందన్నారు. మహబూబ్‌నగర్‌లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విద్యపై ఫోకస్‌ చేస్తున్నానని తెలిపారు. బాలుర జూనియర్‌ కాలేజీ కొత్త భవన నిర్మాణం కొనసాగుతోందని, బాలికల జూనియర్‌ కళాశాలకు రూ. 6.80 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు. ఎంవీఎస్‌ జూనియర్‌ కళాశాలను భవిష్యత్‌లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మాదిరిగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రస్తుతం రూ.7కోట్లతో భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలను రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, వాటిని పూర్తిచేసి 60వ వార్షికోత్సవాన్ని అక్కడే నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. అరుట్ల మోడల్‌ను ఎంవీఎస్‌ జూనియర్‌ కాలేజీలో అమలు చేస్తామన్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌, లా కళాశాల బ్లాకులు వచ్చే విద్యాసంవత్సరంలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే రెండు హాస్టల్‌ బ్లాకులు పూర్తిచేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలకు ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. స్టేడియం కోసం రెండెకరాలు సేకరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రెండు మైనారిటీ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్లకు త్వరలో శంకుస్థాపన చేస్తామని, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. విదేశాల్లోని కౌంటీల మాదిరిగా ఇక్కడ ఫూలే, అంబేడ్కర్‌ విజ్ఞాన కేంద్రంలో పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ మారేపల్లి సురేందర్‌రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఎన్‌పీ వెంకటేశ్‌, బెన్హర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:12 AM