గిరిజనం.. అడవికి దూరం
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:12 PM
నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ అభయారణ్యం నుంచి గిరిజనులు తరలిపోనున్నారు.
- నల్లమల నుంచి గ్రామాల తరలింపునకు చర్యలు
- మొదటి విడతలో సార్లపల్లి, కొల్లంపెంట, తాటిగుండాల, కుడిచింతలబైలు
- కలెక్టర్ ఆదేశంతో లబ్ధిదారులకు ఖాతాలు
- దరఖాస్తులు స్వీకరిస్తున్న బ్యాంక్ అధికారులు
బ్రహ్మగిరి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ అభయారణ్యం నుంచి గిరిజనులు తరలిపోనున్నారు. అటవీ ప్రాంతంలోని గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియను అటవీశాఖ వేగవంతం చేసింది. నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఆదేశం మేరకు అమ్రాబాద్ మండలంలోని సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాలను మొదటి విడతలో తరలిస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజల్లో ఆప్షన్ - 1ను 160 మంది ఎంచుకున్నారు. వారి ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమ చేయనున్నారు. అందుకు కలెక్టర్, లబ్ధిదారుని పేరున జాయింట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. దానిలో భాగంగా శుక్రవారం సార్లపల్లిలో నాగర్‌కర్నూల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ చంద్రశేఖర్ అధ్వర్యంలో సిబ్బంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి రోజు సార్లపల్లిలో 80 ఖాతాలను ప్రారంభించినట్లు మేనేజర్ తెలిపారు. శనివారం కుడిచింతలబైలులో బ్యాంక్ ఖాతాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. లబ్ధిదారులు అందుబాటులో ఉండి ఆధార్, ఓటర్, పాన్‌కార్డులతో పాటు, రెండు ఫొటోలను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.
త్వరలోనే చెక్కుల పంపిణీ
మొదటి విడుతలో ఆప్షన్-1ను ఎంచుకున్న వారికి బ్యాంక్ ఖాతాలు తెరిచిన తర్వాత రూ. 15 లక్షల చెక్కులను కలెక్టర్, అటవీశాఖ తరఫున డీఎఫ్‌వో పంపిణీ చేస్తారని ఎన్‌జీవో బాపురెడ్డి తెలిపారు. లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగా రూ. 5 లక్షలను రెండు విడతలుగా తీసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. మిగతా రూ. 10 లక్షలను కొంత కాలం డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. పునరావాస గ్రామస్థులకు పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారంలో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆ పనులకు భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌బీవో శ్వేత, బ్యాంక్ సిబ్బంది అనూష, లక్ష్మణ్, రాజేశ్, శేషయ్య, చంద్రకళ సార్లపల్లి పునరావస గ్రామ కమిటీ సభ్యులు సంతోశ్, రాములు, వెంకటేశ్, నారాయణ, తిరుపతి, గంగయ్య పాల్గొన్నారు.