పార్టీలు సహకరిస్తేనే పారదర్శక ఓటరు జాబితా
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:38 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ టర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్
గద్వాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ టర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని తన చాంభర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్ (స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 90.99 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) పంపిణీ చేసి ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లు పూర్తి చేసి, సరైన వివరాలతో నింపి సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందించేలా ప్రజలను చైతన్యపరచాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, ఓటరుజాబితా పారదర్శకంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు తమవంతు సహకారం అందించాలని కోరారు. జూన్ 25వ తేదీ నుంచి జూలై 24 వరకు బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి, సెప్టెంబరు 28 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించి, వాటి పరిశీలన అనంతరం అక్టోబరు 1న తుది ఓటరు బాబితా విడుదల చేస్తామన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారి మంజుల, గద్వాల తహసీల్దార్ హరికృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.