ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలి
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:34 PM
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతం పేర్కొన్నారు.
- గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతం
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 5 (ఆంరఽధజ్యోతి) : డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతం పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఖుష్బూగుప్తాతో కలిసి వీసీ హాల్‌లో గృహ నిర్మాణ, రెవెన్యూ, మునిసిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే నిర్మాణం పూర్తఐన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఖాళీగా ఉంచకుండా లబ్ధిదారులకు కేటాయించాలన్నారు. ఆశ, అంగన్‌వాడీ, ఇతర తక్కువ వేతనాలతో పనిచేసే ప్రభుత్వ సిబ్బందిని కేవలం అనర్హులుగా ప్రకటించరాదని, వారి కుటుంబ పరిస్థితులు, ఆదాయం, ఆస్తులను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతీ తిరస్కరణకు స్పష్టమైన కారణాలు నమోదు చేయాలని ఆదేశించారు. సమీక్షలో భాగంగా మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజవర్గ పరిధిలో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు పంపిణీ చేసిన ఇళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఏనుగొండలోని మౌలాలిగుట్టలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను సందర్శించి లబ్ధిదారుల నివాసం, తాగునీరు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, డీఆర్వో నిర్మల, ఆర్డీవో నవీన్, హౌసింగ్ పీడీ ఉపేందర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మహబూబ్‌నగర్ పరిధిలోని హౌసింగ్ సమస్యలపై డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. మౌలాలీగుట్ట డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన, బండమీదిపల్లి రాజీవ్ గృహ కల్ప పునర్ నిర్మాణంపై ఎండీ దృష్టికి తీసుకొచ్చారు.