Share News

వలస జీవితాల్లో విషాదం

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:38 PM

పొట్టకూటికోసం వలస వెళ్లి వారి కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది.

వలస జీవితాల్లో విషాదం
సంఘటనా స్థలంలో చెల్లచెదురుగా పడి ఉన్న క్షతగాత్రులు

- కర్ణాటక రాష్ట్రం, యాదగిరి వద్ద ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్‌

- ఇద్దరి మృతి, 15 మందికి తీవ్ర, ఐదుగురికి స్వల్ప గాయాలు

- బాధితులందరూ గద్వాల జిల్లా, ఇందువాసి గ్రామవాసులు

గట్టు, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : పొట్టకూటికోసం వలస వెళ్లి వారి కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, ఇందువాసి గ్రామానికి చెందిన 30 మంది కొద్ది రోజుల పత్తితీత పనుల కోసం కుటుంబాలతో కర్ణాటక రాష్ట్రం, యాదగిరి జిల్లాకు వలస వెళ్లారు. జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోని బెండుగమ్ముల గ్రామంలో బస ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రతీ రోజు పనులకు వెళ్లి వస్తున్నారు. అలాగే శనివారం ఉదయం 6 గంటల సమయంలో ట్రాక్టర్‌లో సమీప గ్రామానికి బయలుదేరారు. భారత్‌మాల రహదారిపై వారు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ బలంగా ఢీకొన్నది. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ ఇంజన్‌ నుంచి విడిపోయింది. కూలీలందరూ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. అసలు ఏమి జరిగిందో, ఎవరు ఎక్కడపడిపోయారో వారికి అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. కాసేపటికి తేరుకొని ఒకరినొకరు చేరుకొని ఎవరికేమి అయ్యిందో చూసుకున్నారు. అప్పటికే ఇందువాసి గ్రామానికి చెందిన ఏసేపు (40) మృతి చెంది ఉన్నాడు. నాగన్న (50)తో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలు, ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను యాదగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నాగన్నను రాయిచూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద విషయం తెలియడంతో ఇందివాసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.

Updated Date - Oct 10 , 2026 | 11:38 PM