నేటి పొదుపు.. భవిష్యత్తుకు మదుపు
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:33 PM
ఒక్కొక్క రూపాయి పొదుపు.. భవిష్యత్తులో అది పెద్ద మొత్తంగా మారి మన ఆర్థిక భద్రతకు పునాది అవుతుంది.
- పోస్టాఫీసుల్లో ఆకర్షణీయమైన పథకాలు
- చిన్న మొత్తంతోనే ప్రారంభించే అవకాశం
- అత్యధికంగా 8.2 శాతం వరకు వడ్డీ
- వృద్ధులు, మహిళలు, బాలికలకు ప్రయోజనం
- నేడు ప్రపంచ పొదుపు దినోత్సవం
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఒక్కొక్క రూపాయి పొదుపు.. భవిష్యత్తులో అది పెద్ద మొత్తంగా మారి మన ఆర్థిక భద్రతకు పునాది అవుతుంది. సంపాదనలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా దాచుకోవడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవచ్చు. ఆదాయానికి అనుగుణంగా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే పిల్లల చదువులు, అత్యవసర వైద్య ఖర్చులు, గృహ అవసరాలు, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత చేకూరుతుంది. అందుకోసం తపాల శాఖ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ప్రతీ ఊరిలో అందరికీ అందుబాటులో పోస్టాఫీసుల్లో తక్కువ మొత్తంతోనే పొదుపు చేయడం ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఆదాయానికి అనుగుణంగా పెట్టుబడి, కాలపరిమితి, వడ్డీ చెల్లింపు విధానం ఆధారంగా ప్రజలు తమకు అనుకూలమైన పథకాన్ని ఎంచుకోవచ్చు. నేడు (అక్టోబరు 30) ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న వివిధ పొదుపు పథకాలు, వాటి ప్రయోజనాల వివరాలతో ప్రత్యేక కథనం..
8.2 శాతం వరకు వడ్డీ
పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీసీ), సుకన్య సమృద్ధి యోజన పథకాలపై అత్యధికంగా 8.2 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)పై 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రంపై 7.5 శాతం, మంత్లీ ఇన్కమ్ స్కీంపై 7.4 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం వడ్డీ అమల్లో ఉంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 7.5 శాతం, రికరింగ్ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. సాధారణ సేవింగ్స్ ఖాతాపై 4 శాతం వడ్డీ లభిస్తుంది.
వృద్ధులకు క్రమమైన ఆదాయం
పదవీ విరమణ అనంతరం ఆర్ధిక భద్రత కోరుకునే వృద్ధులకు ‘సీనియర్ సిటీజన్ సేవింగ్స్ స్కీం(ఎస్సీఎస్ఎస్)’ పథకంలో ఐదేళ్ల కాలపరమితితో పెట్టుబడి పెట్టవచ్చు. సాధారణంగా 60 ఏళ్లు పైబడినవారు అర్హులు. నిబంధనలకు లోబడి కొన్ని వర్గాలకు, పదవీ విరమణ చేసిన వారికి ముందస్తు అర్హత ఉంటుంది. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ పథకంలో ప్రతీ మూడు నెలలకు వడ్డీ చెల్లిస్తారు.
ప్రతీ నెల ఆదాయం
ఒకేసారి పెట్టుబడి పెట్టి, నెలనెలా ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీసు ‘మంత్లీ ఇన్కమ్ స్కీం’ ఉపయోగకరంగా ఉంటుంది. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో వ్యక్తిగత ఖాతాకు గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. స్థిరమైన ఆదనపు ఆదాయం కోరుకునే కుటుంబాలు, పదవీ విరమణ చేసినవారు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
ఆడపిల్లల భవిష్యత్తుకు సుకన్య సమృద్ధి
ఆడపిల్లల ఉన్నత విద్య, భవిష్యత్తు అవసరాల కోసం సుకన్య సమృద్ధి యోజన ఉపయోగపడుతుంది. ఐదేళ్లలోపు బాలికల పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతాను ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 21 సంవత్సరాలకు మెచ్యురిటీ వస్తుంది. నిబంధనల ప్రకారం మెదటి 15 సంవత్సరాలు డిపాజిట్ చేయాలి. దీర్ఘకాలిక పొదుపుతో పిల్లల భవిష్యత్తుకు ఆర్ధిక పునాది వేయవచ్చు.
ఐదేళ్ల పొదుపునకు టైమ్ డిపాజిట్
ఐదేళ్ల పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ఎస్సీలో కనీసం వెయ్యి రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. పెట్టుబడిపై వడ్డీ సమకూరుతూ మెచ్యురిటీ సమయంలో పూర్తి మొత్తం అందుతుంది. టైమ్ డిపాజిట్లో 1, 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితులను ఎంచుకోవచ్చు. పెట్టుబడి వ్యవధి, అవసరాలను బట్టి తగిన పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
దీర్ఘకాలిక భద్రతకు పీపీఎఫ్
దీర్ఘకాలంలో నిధిని సమకూర్చుకోవాలనుకునేవారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనుకూలంగా ఉంటుంది. ఏడాదికి కనీసం రూ.500 గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ పథకానికి 15 సంవత్సరాల కాల పరిమితి ఉంది. నిబంధనలకు అనుగుణంగా ఖాతాను పొడిగించుకోవచ్చు. పన్ను వినహాయింపు ప్రయోజనాలు కూడా వర్తించే అవకాశం ఉండటంతో పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనలను పరిశీలించాలి.
పెట్టుబడి రెట్టింపునకు కిసాన్ వికాస్ పత్ర
కిసాన్ వికాస పత్ర(కేవీపీ) పథకంలో ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడి 115 నెలల్లో, అంటే 9 సంవత్సరాల 7 నెలలకు రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలం పాటు డబ్బును కొనసాగించగలిగే వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. మరోవైపు, నెలనెలా చిన్న మొత్తాలను జమ చేయాలనుకునేవారు రికరింగ్ డిపాజిట్‌ను ఎంచుకోవచ్చు. క్రమశిక్షణతో పొదుపు చేసే అలవాటను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుంది.
అవసరాలకు అనుగుణంగా..
పొదుపు పథకాన్ని ఎంచుకునేటప్పుడు వడ్డీ రేటుతో పాటు పెట్టుబడి కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ, నిబంధనలు, పన్ను ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వడ్డీ రేట్లు మారే అవకాశం ఉన్నందున ఖాతా ప్రారంభించే ముందు పోస్టాఫీసులో ఖాతా వివరాలు తెలుసుకోవాలి.
పొదుపును అలవాటు చేసుకోవాలి
ప్రజలందరూ పొదుపు అలవాటు చేసుకోవాలి. పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న వివిధ పొదుపు పథకాల ద్వారా తమ భవిష్యత్తుకు ఆర్ధిక భరోసా పొందవచ్చు. ప్రతీ ఒక్కరూ తమ ఆదాయానికి అనుగుణంగా పొదుపును ప్రారంభించాలి. అందుకోసం తమ ఆదాయం, అవసరాలకు అనుగుణమైన పథకాన్ని ఎంచుకోవాలి.
- సయ్యద్ గఫార్, సబ్ పోస్టుమాస్టర్, నాగర్‌కర్నూల్