Share News

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:27 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరుకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. పాలమూరు బిడ్డ రేవంత్‌ జిల్లాకు వస్తున్నారని, ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నందున ఆయనకు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం, జీఎంఆర్‌, అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిర బోయి

రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలు

మహబూబ్‌నగర్‌/జడ్చర్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరుకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. పాలమూరు బిడ్డ రేవంత్‌ జిల్లాకు వస్తున్నారని, ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నందున ఆయనకు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సీఎం సభ నిర్వహించే ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, జి మధుసూదన్‌రెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిరబోయిలతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారుల కు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడు తూ సీఎం జిల్లాకు వస్తున్న సందర్భంగా రూ.1200 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయబోతున్నారని చె ప్పారు. ఇంత మొత్తంలో పాలమూరుకు నిఽ దులు ఇచ్చిన సందర్భం గతంలో లేదన్నారు. జిల్లాబిడ్డ ముఖ్యమంత్రి కావడం పాలమూరుకు అదృష్టమని చెప్పారు. జడ్చర్ల చిట్టె బోయిన్‌పల్లి వద్ద రూ.200 కోట్లతో చేపట్టబోయే ట్రిపుల్‌ఐటీకి ముఖ్యమంత్రి ముం దుగా శంకుస్థాపన చేసి, అక్కడినుంచి ఎంవీఎస్‌ కళాశాల మైదానం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఇందులో నగరానికి సంబంధించిన రూ.603 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రూ.220 కోట్లతో తాగునీటి పథకాలు, రూ.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం సభకు కార్యకర్తలు, పాలమూరు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో జరిగే శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి శ్రీహరి ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో ఐఐఐటీ పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండటంతోనే వచ్చిందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐఐటీ మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణకు వర ప్రదాయిని అని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, మధుసూదన్‌నాయక్‌, ఆర్డీఓ నవీన్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెక్కరి అనిత నాయకులు ఆనంద్‌కుమార్‌గౌడ్‌, వినోద్‌కుమార్‌, సిరాజ్‌ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీ్‌సశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జోగులాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ జిల్లా పోలీసులతో సమావేశమై బందోబస్తుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. 1,184 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌, అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, ఏఆర్‌ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

సీఎం రాక నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సభ జరిగే ఎంవీఎస్‌ కళాశాల మైదానం వైపు వాహనాల రాకపోకలపై ఆంఽక్షలు విధించారు. పిస్తా హౌస్‌ బైపాస్‌ నుంచి రాయిచూర్‌ రోడ్డు, భూత్పూర్‌-మహబూబ్‌నగర్‌ నగరం, పీయూ నుంచి బైపాస్‌ మీదుగా పిస్తా హౌస్‌ వరకు సీఎం పర్యటనకు వచ్చే వాహనాలు మాత్రమే అనుమతించనున్నారు. జడ్చర్ల నుంచి రాయిచూర్‌ వెళ్లే వాహనాలు ఎస్‌వీఎస్‌ నుంచి నగరంలో నుంచి వెళ్ళాల్లి ఉంటుంది. నాగర్‌కర్నూల్‌ నుంచి టౌన్‌లోకి వచ్చే వాహనాలు భూత్పూర్‌ దగ్గర ఎడమకు మళ్లి తాటికొండ మీదుగా నగరానికి చేరుకోవాలి. కర్నూల్‌ నుంచి నగరానికి వచ్చే వాహనాలు తాటికొండ మీదుగా నగరానికి చేరుకోవాలని పోలీసుశాఖ స్పష్టం చేసింది.

Updated Date - Jan 16 , 2026 | 11:27 PM